తెలంగాణ రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి పాత్రికేయుడికి అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనల మేరకు జర్నలిస్టుల ఆరోగ్యం మెరుగుపరచడంతో పాటు మరిన్ని సంక్షేమ సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన హామీ ఇచ్చారు. గురువారం సమాచార శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కొందరు జర్నలిస్టులకు మంత్రి స్వయంగా కొత్త అక్రిడిటేషన్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. గతంలో 32,500 మందికి కార్డులు ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ కేవలం 23,352 మందికే పరిమితం చేసి జర్నలిస్టుల ప్రయోజనాలను దెబ్బతీశారని విమర్శించారు.
ప్రస్తుత ప్రజా ప్రభుత్వం జర్నలిస్టుల సంఖ్యను పెంచుతూ సుమారు 46 వేల మందికి పైగా అక్రిడిటేషన్లు ఇచ్చేలా నిబంధనల్లో కీలక మార్పులు చేసిందని మంత్రి పొంగులేటి వెల్లడించారు. ఇప్పటికే సుమారు 2,800 దరఖాస్తులను ఆమోదించి కార్డులు జారీ చేసినట్లు వివరించారు. జర్నలిస్టు సంఘాల ప్రతినిధుల సూచనలను పరిగణనలోకి తీసుకుని జీవోలలో అవసరమైన మార్పులు చేర్పులు చేశామని తెలిపారు. అర్హులైన జర్నలిస్టులకు గుర్తింపు కార్డుల మంజూరు విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. మే 1వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అక్రిడిటేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం చేపట్టాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేస్తామని ప్రకటించారు.
కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేసేందుకు మే 10వ తేదీని కటాఫ్ డేట్‌గా నిర్ణయించినట్లు మంత్రి సూచించారు. ఆ తేదీలోగా వచ్చే అర్హత గల దరఖాస్తులన్నింటినీ వెంటనే ఆమోదిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో అక్రిడిటేషన్ల సంఖ్యపై స్పష్టత వస్తే దానికి అనుగుణంగా జర్నలిస్టుల ఆరోగ్యం ఇరత సౌకర్యాల కల్పనకు ఒక పక్కా ప్రణాళిక రూపొందించుకోవచ్చని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ దిశగా అధికారులకు పలు కీలక సూచనలు చేశారని వెల్లడించారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన అజెండా అని ఆయన పునరుద్ఘాటించారు.
జర్నలిస్టులు వివిధ సంస్థల్లో ఉద్యోగాలు మారినప్పటికీ అక్రిడిటేషన్ల మంజూరు అనేది ఒక నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎవరికీ ఎటువంటి సందేహాలు అవసరం లేదని భరోసా ఇచ్చారు. దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణలో పాత్రికేయుల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని చెప్పారు. త్వరలోనే పాత్రికేయ సంఘాల ప్రతినిధులతో ప్రత్యేకంగా భేటీ అవుతామని తెలిపారు. ఏప్రిల్ 30వ తేదీతో గడువు ముగుస్తున్న జర్నలిస్టుల బస్సు పాస్‌ల గడువును మరో 15 రోజుల పాటు పొడిగించేలా తక్షణ చర్యలు తీసుకుంటామని మంత్రి పొంగులేటి ఈ సందర్భంగా కీలక ప్రకటన చేశారు.
ALSO READ: సమస్యల పుట్ట మాడుగుల ఫీల్డ్ మాయ కార్యాలయం…! మండి పడుతున్న ప్రజలు…