కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు (వీహెచ్) తన ఉదారతను చాటుకున్నారు. తెలంగాణ ప్రభుత్వ బీసీ సంక్షేమ శాఖ అభివృద్ధి సలహాదారుగా నియమితులైన ఆయన ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ పదవి ద్వారా తనకు అందే పూర్తి జీతాన్ని పేద విద్యార్థుల ఉన్నత చదువుల కోసం వెచ్చించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తన పదవీ కాలం ముగిసే వరకు వచ్చే ప్రతి రూపాయిని సొంత ట్రస్టుకు బదిలీ చేస్తానని వెల్లడించారు. రాజకీయాల్లో తనకు గాడ్ ఫాదర్ ఎవరూ లేరని.. కేవలం కష్టాన్నే నమ్ముకుని ఈ స్థాయికి ఎదిగానని ఆయన భావోద్వేగంతో గుర్తు చేసుకున్నారు. తన జీవితాంతం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం శ్రమిస్తానని ఈ సందర్భంగా ఆయన పునరుద్ఘాటించారు.
రాష్ట్ర మంత్రి హోదాతో కూడిన ఈ కీలక బాధ్యతలను ప్రభుత్వం ఇటీవల ఆయనకు అప్పగించింది. ఈ నియామకానికి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఇప్పటికే అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వీహెచ్‌కు నెలకు రూ. 1,00,000 వేతనం అందుతుంది. ఒకవేళ ప్రభుత్వ నివాసం కేటాయించకపోతే అదనంగా రూ. 50,000 ఇంటి అద్దె భత్యం పొందే అవకాశం ఉంది. సొంత వాహనాన్ని వినియోగిస్తే కన్వేయన్స్ అలవెన్స్ కింద రూ. 30,000 ఉంటుంది. ఇంధన ఖర్చుల కోసం మరో రూ. 15,000 ప్రభుత్వం చెల్లిస్తుంది. వీటితో పాటు డ్రైవర్‌తో కూడిన ప్రభుత్వ వాహనాన్ని వినియోగించుకునే వెసులుబాటును కూడా కల్పించారు. అఖిల భారత సర్వీసు అధికారులు మంత్రులకు లభించే వైద్య ఖర్చుల రీయింబర్స్‌మెంట్ సౌకర్యం కూడా ఆయనకు వర్తిస్తుంది.
ఈ సలహాదారు కార్యకలాపాల నిర్వహణ కోసం ప్రత్యేక సిబ్బందిని ప్రభుత్వం కేటాయించింది. ఒక ప్రైవేట్ సెక్రటరీ ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ ఇద్దరు ఆఫీస్ సబార్డినేట్లు ఒక డ్రైవర్‌ను నియమించారు. ఈ సిబ్బంది వేతనాలు ఇతర ఖర్చులను బీసీ సంక్షేమ శాఖ రెగ్యులర్ బడ్జెట్ నుంచి భరించనున్నారు. బీసీ వర్గాల సంక్షేమం అభివృద్ధి దిశగా ప్రభుత్వానికి విలువైన సూచనలు అందించడంలో హనుమంతరావు రాజకీయ అనుభవం ఎంతగానో దోహదపడనుంది. రాష్ట్రంలోని వెనుకబడిన తరగతుల ప్రజల స్థితిగతులను మెరుగుపరిచేందుకు ఆయన తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో సంపాదించిన జ్ఞానాన్ని ఉపయోగించనున్నారు.
పదవుల కంటే పేదల సేవకే అగ్ర ప్రాధాన్యత ఇస్తానన్న ఆయన వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ప్రజా సేవలో దశాబ్దాల కాలంగా కొనసాగుతున్న వీహెచ్.. ఇలాంటి ఆదర్శవంతమైన నిర్ణయంతో మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రభుత్వం కల్పించిన ఆర్థిక వెసులుబాటును వ్యక్తిగత అవసరాలకు వాడుకోకుండా సమాజ హితం కోసం మళ్లించడం గొప్ప విషయమని తోటి రాజకీయ నాయకులు కొనియాడుతున్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆయన తీసుకున్న ఈ నిర్ణయం ఎంతోమందికి స్ఫూర్తినిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో బీసీ వర్గాల విద్యాభివృద్ధికి ఈ నిధులు తోడ్పడనున్నాయి.
ALSO READ: తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు.. రాబోయే మూడు రోజులు భారీ వర్షాలు