Homeతెలంగాణఫోన్ ట్యాపింగ్ కేసులో రాజకీయ కుట్ర.. కేసీఆర్, హరీశ్‌రావులను ఇరికించే ప్రయత్నం: ఆర్ఎస్ ప్రవీణ్‌

ఫోన్ ట్యాపింగ్ కేసులో రాజకీయ కుట్ర.. కేసీఆర్, హరీశ్‌రావులను ఇరికించే ప్రయత్నం: ఆర్ఎస్ ప్రవీణ్‌

 తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో రాజకీయ నాయకులను ముఖ్యంగా మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రి హరీశ్‌రావును ఇరికించే కుట్ర జరుగుతోందని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ తీవ్రంగా ఆరోపించారు. గురువారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై మండిపడ్డారు. 2024 మార్చిలో ఒక పోలీస్ అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన ఈ కేసు ఇప్పటికీ ఒక టీవీ ధారావాహిక వలే సాగుతూనే ఉందని విమర్శించారు. ఇప్పటివరకు దాదాపు 350 మంది సాక్షులను విచారించినా కూడా ఇంతవరకు ఛార్జ్‌షీట్ ఎందుకు ఫైల్ చేయలేదని ఆయన నిలదీశారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి రెండుసార్లు ప్రత్యేక విచారణ బృందాన్ని (సిట్) ఏర్పాటు చేయడం కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యేనని ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. సాంకేతిక ఆధారాలతో నిష్పక్షపాతంగా విచారణ జరపాల్సిన ఈ కేసులో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలనే కొంతమంది పాత నేరస్థులపై ఒత్తిడి తెచ్చి రాజకీయ నాయకుల పేర్లను చెప్పించాలని చూస్తున్నారని పేర్కొన్నారు. తప్పుడు ఆధారాలు సేకరిస్తూ ప్రజా ప్రతినిధులను కేసులో ఇరికించాలని ప్రభుత్వం చూస్తోందని మండిపడ్డారు. గతంలో రేవంత్‌రెడ్డి సైతం ఢిల్లీ వేదికగా ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక సాధారణమైన అంశం అని వ్యాఖ్యానించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.

ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ అంశంలో గత అధికారులు ఎవరైనా తప్పు చేస్తే వారిపై చట్టబద్ధంగా విచారణ జరపాలి కానీ లేని ఆధారాలు సృష్టించడం సరికాదని ఆయన హితవు పలికారు. ఆధారాలను ఫ్యాబ్రికేట్ చేసి తప్పుడు సాక్ష్యాలను కోర్టుల ముందు చూపించి బీఆర్ఎస్ అగ్ర నాయకులను వేధించాలని చూడడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ అత్యంత గోప్యంగా జరిగే ప్రక్రియ అని దీనికి సంబంధించి రిమాండ్ రిపోర్ట్ సీడీలను కోర్టుకు సమర్పించాల్సిన అవసరం లేదని వివరించారు. బాధ్యత తెలియని హోంమంత్రి వ్యవహార శైలి వల్ల పోలీస్ శాఖ ప్రతిష్ట నాశనం అవుతున్నదని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1గా పేర్కొన్న మాజీ పోలీస్ అధికారి టి.ప్రభాకర్‌రావును 19 రోజుల పాటు విచారణ పేరుతో మానసికంగా హింసించారని ప్రవీణ్‌కుమార్ వెల్లడించారు. ఒక సీనియర్ అధికారిని నేల మీద పడుకోబెట్టి అవమానించారని ఆయనకు బెయిల్ రాకుండా అడ్డుకోవడానికి ప్రభుత్వం కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని వెచ్చించిందని విమర్శించారు. అయినప్పటికీ సుప్రీంకోర్టు ప్రభాకర్‌రావుకు అనుకూలంగా తీర్పును ఇచ్చిందని అది ప్రభుత్వానికి చెంపపెట్టు అని పేర్కొన్నారు. ఎలాగైనా కేసీఆర్ హరీశ్‌రావు కేటీఆర్ పేర్లు చెప్పాలని సంధ్యా శ్రీధర్‌రావు అనే వ్యక్తిని అధికారులు బలవంతపెడుతున్నారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిని వదిలేసి కేవలం ప్రతిపక్ష నాయకులపై నిఘా పెట్టడం వేధింపులకు గురిచేయడమే లక్ష్యంగా పెట్టుకుందని విమర్శించారు. చట్టం తన పని తాను చేసుకుపోవాలి తప్ప రాజకీయ ప్రయోజనాల కోసం పోలీసు వ్యవస్థను వాడుకోకూడదని సూచించారు. ప్రభుత్వం సృష్టించే కృత్రిమ ఆధారాలు కోర్టుల ముందు నిలవవని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తప్పుడు విచారణలు ఆపి వాస్తవాలను బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

ALSO READ: జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యం.. అర్హులైన ప్రతి ఒక్కరికీ అక్రిడిటేషన్లు అందజేస్తాం: మంత్రి పొంగులేటి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు