వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తన మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో బెయిల్ కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. కేసు విచారణ ఇప్పటికే తుది దశకు చేరుకున్నందున ఈ సమయంలో నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించడం సరైన విధానం కాదని ధర్మాసనం స్పష్టం చేసింది. ముందుగా హైకోర్టును ఆశ్రయించాలని అనంతబాబు తరఫు న్యాయవాదులకు సూచించింది.
కేసు విచారణ వేగంగా కొనసాగుతోందని ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా కోర్టుకు తెలిపారు. మొత్తం 87 మంది సాక్షుల్లో ఎక్కువ మంది ఇప్పటికే తమ వాంగ్మూలాలను నమోదు చేశారని వివరించారు. ఈ దశలో నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తే విచారణపై ప్రభావం పడే అవకాశం ఉందని వాదించారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. కేసులో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది.
అనంతబాబు భార్య తరఫున విచారణ గడువును మరో ఆరు నెలలు పొడిగించాలని చేసిన అభ్యర్థనను కూడా సుప్రీంకోర్టు తిరస్కరించింది. కేసు విచారణను రోజువారీ ప్రాతిపదికన కొనసాగిస్తూ, సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ట్రయల్ కోర్టును ఆదేశించింది.
సుప్రీంకోర్టు సూచనల మేరకు అనంతబాబు తరఫు న్యాయవాదులు బెయిల్ పిటిషన్‌ను ఉపసంహరించుకుని హైకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమయ్యారు. ఇదే సమయంలో వీడియో ఫైల్స్, డిజిటల్ ఆధారాలకు సంబంధించిన అనుబంధ పిటిషన్‌ను కూడా పిటిషనర్ తరఫు న్యాయవాదులు వెనక్కి తీసుకున్నారు.
కాగా, మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో గతంలో అనంతబాబుకు బెయిల్ లభించింది. అయితే సాక్షులను బెదిరించారన్న ఆరోపణలు రావడంతో ఆయనకు మంజూరైన బెయిల్‌ను రద్దు చేశారు. దీంతో ప్రస్తుతం అనంతబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.
also read: బెంగళూరులో భారీ పేలుడు.. ఫుట్‌పాత్‌పై వెళ్తున్న వ్యక్తికి గాయాలు
