Homeజాతీయంబంగారం కొనుగోళ్లు తగ్గించాలన్న నా విజ్ఞప్తిని ప్రజలు స్వీకరించడం సంతోషంగా ఉంది: ప్రధాని మోదీ

బంగారం కొనుగోళ్లు తగ్గించాలన్న నా విజ్ఞప్తిని ప్రజలు స్వీకరించడం సంతోషంగా ఉంది: ప్రధాని మోదీ

బంగారం కొనుగోళ్లను తగ్గించాలంటూ తాను చేసిన విజ్ఞప్తిని దేశ ప్రజలు సానుకూలంగా స్వీకరించడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ప్రజలు అవసరం లేనప్పుడు బంగారం కొనుగోలు చేయకుండా ఉండటంతో వారి డబ్బు ఆదా అయిందని పేర్కొన్నారు. అంతేకాకుండా బంగారం ధరలు కూడా తగ్గుముఖం పట్టాయని తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని లఖ్‌నవూలో గోమతీ నగర్‌లో శనివారం నిర్వహించిన ఐదో జాతీయ నైపుణ్య స్నాతకోత్సవంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. దేశ ప్రజలకు తాను చేసిన విజ్ఞప్తి వెనుక జాతీయ ప్రయోజనాలు ఉన్నాయని వివరించారు. ఏడాది పాటు అత్యవసరమైతే తప్ప బంగారం కొనుగోలు చేయవద్దని ప్రజలను కోరినట్లు గుర్తుచేశారు. గతంలో దేశంలో ఆహార కొరత ఏర్పడిన సమయంలో అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి ఒక పూట భోజనం మానేయాలని పిలుపునిచ్చారని, ప్రజలు కూడా ఆయన సూచనను పాటించారని చెప్పారు.

ప్రస్తుత పరిస్థితుల్లోనూ దేశ ప్రజల ఆలోచనా విధానంలో మార్పు రాలేదని మోదీ పేర్కొన్నారు. సామాన్య వ్యక్తిగా తాను చేసిన విజ్ఞప్తికి ప్రజలు స్పందించి బంగారం కొనుగోళ్లను తగ్గించారని తెలిపారు. తన మాట విని డబ్బు ఆదా చేసుకున్నామని పలువురు చెబుతుండటం ఆనందంగా ఉందన్నారు.

ప్రధాని పిలుపు తర్వాత తగ్గిన బంగారం దిగుమతులు

ఈ ఏడాది మే నెలలో పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరిగాయి. దీంతో దేశ విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి ఏర్పడే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన సభలో ప్రధాని మోదీ తొలిసారిగా బంగారం కొనుగోళ్లను తగ్గించాలని ప్రజలకు సూచించారు. జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఏడాది పాటు అనవసరంగా బంగారం కొనుగోలు చేయకుండా ఉండాలని కోరారు. ఇంధన వినియోగాన్ని తగ్గించడం, వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని ప్రోత్సహించడం వంటి ఇతర సూచనలు కూడా చేశారు.

ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య దేశంలో బంగారం దిగుమతుల విలువ సుమారు 40 శాతం తగ్గి 24.78 బిలియన్ డాలర్లకు చేరింది. గతేడాది ఇదే కాలంలో ఈ విలువ 41.24 బిలియన్ డాలర్లుగా నమోదైంది. మరోవైపు ప్రపంచ స్వర్ణ మండలి (WGC) నివేదిక ప్రకారం.. జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో భారత్‌లో బంగారం డిమాండ్ 29 శాతం తగ్గి 162 టన్నులకు పరిమితమైంది.

దిగుమతి సుంకం పెంపుతోనూ ప్రభావం

బంగారం కొనుగోళ్లను నియంత్రించే దిశగా ప్రజలకు విజ్ఞప్తి చేయడంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. మే నెలలో బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని 6 శాతం నుంచి 15 శాతానికి పెంచింది. ఈ పరిణామాలు బంగారం దిగుమతులు, డిమాండ్‌పై ప్రభావం చూపినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. మొత్తంగా ప్రజల సహకారం వల్ల జాతీయ ఆర్థిక ప్రయోజనాలకు మేలు జరిగిందని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు.

also read: నవంబర్ 27న థియేటర్లలోకి ‘ఫూలే’.. ప్రత్యేకంగా వీక్షించిన భట్టి విక్రమార్క!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు