క్రైమ్ మిర్రర్ : బాలీవుడ్ ప్రముఖ నటుడు, దర్శకుడు నానా పటేకర్ ఇక లేరు. 75 ఏళ్ల వయసులో ఆయన గుండెపోటుతో కన్నుమూశారు. గోవాలోని దోనా పౌలా ప్రాంతంలో ఉన్న తన నివాసంలో ఆయన అకస్మాత్తుగా స్పృహ కోల్పోయినట్లు తెలుస్తోంది. దీంతో కుటుంబ సభ్యులు, సన్నిహితులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. వైద్యులు దాదాపు 45 నిమిషాల పాటు సీపీఆర్ చేసినప్పటికీ ఆయన ప్రాణాలను కాపాడలేకపోయారు. తెల్లవారుజామున 5:20 గంటలకు ఆయన మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. నానా పటేకర్ మరణంతో హిందీ, మరాఠీ చిత్ర పరిశ్రమల్లో విషాదం నెలకొంది. ఆయనతో అనుబంధం ఉన్న సినీ ప్రముఖులతో పాటు అభిమానులు కూడా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
నాలుగు దశాబ్దాల సినీ ప్రస్థానం
1978లో విడుదలైన ‘గమన్’ సినిమాతో నానా పటేకర్ సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత హిందీ, మరాఠీ చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు పోషిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సహజమైన నటన, బలమైన పాత్రలతో ప్రేక్షకులపై చెరగని ముద్ర వేశారు. ‘పరిందా’, ‘అగ్ని సాక్షి’, ‘అబ్ తక్ చప్పన్’, ‘వెల్కమ్’, ‘రాజ్‌నీతి’, ‘ది వ్యాక్సిన్ వార్’ వంటి సినిమాలు ఆయన కెరీర్‌లో కీలకంగా నిలిచాయి. రజినీకాంత్ నటించిన ‘కాలా’లోనూ నానా పటేకర్ ముఖ్యమైన పాత్రలో కనిపించారు. ‘క్రాంతివీర్’, ‘నటసామ్రాట్’ సినిమాలు ఆయన నటనా ప్రతిభకు మరింత గుర్తింపును తీసుకొచ్చాయి. ‘క్రాంతివీర్’లోని నటనకు ఉత్తమ నటుడిగా జాతీయ చలనచిత్ర అవార్డును అందుకున్నారు. నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన కెరీర్‌లో 70కి పైగా సినిమాల్లో నటించారు.
నటనతో పాటు దర్శకత్వం, రచనలోనూ..
నానా పటేకర్ నటుడిగానే కాకుండా దర్శకుడు, రచయితగానూ తన ప్రతిభను ప్రదర్శించారు. సినీ రంగంలో ఆయన చేసిన కృషికి జాతీయ స్థాయిలో పలు పురస్కారాలు దక్కాయి. 2013లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ పురస్కారాన్ని అందించింది.
