Homeక్రైమ్Haryana Crime: ప్రేమ కోసం భర్తను లేపేసిన నవవధువు.. చివరకు వాట్సాప్ చాట్స్‌ తో దొరికిపోయింది!

Haryana Crime: ప్రేమ కోసం భర్తను లేపేసిన నవవధువు.. చివరకు వాట్సాప్ చాట్స్‌ తో దొరికిపోయింది!

హర్యానాలో ఓ నవవధువు వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో భర్తను ప్రియుడితో కలిసి హత్య చేయించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. తొలుత ఈ కేసును ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా భావించిన పోలీసులు, తర్వాత బయటపడిన ఆధారాలతో అసలు నిజాన్ని గుర్తించారు.

జర్తాల్ గ్రామానికి చెందిన 21 ఏళ్ల మోనుకు ఇటీవల కసోలి గ్రామానికి చెందిన తన్నుతో వివాహం జరిగింది. అయితే, ఈ పెళ్లి తన్నుకు ఇష్టం లేదు. పెళ్లికి ముందే ఆమెకు సోను అనే యువకుడితో ప్రేమ సంబంధం ఉండేది. వివాహం తర్వాత కూడా ఇద్దరూ రహస్యంగా మాట్లాడుకుంటూనే ఉన్నారు. చివరకు భర్తను తొలగించాలని ఇద్దరూ పథకం వేశారు. జూన్ 8న రాత్రి తన్ను ఫోన్ చేసి మోనును కసోలి గ్రామానికి రమ్మని పిలిచింది. అక్కడ ముందుగానే సోను పంపిన హరిఓమ్, అమన్ అనే ఇద్దరు వ్యక్తులు వేచి ఉన్నారు. మోను అక్కడికి చేరుకున్న వెంటనే అతడిపై దాడి చేసి ఊపిరాడకుండా చేశారు. అనంతరం స్పృహ తప్పిన మోనును సమీపంలోని కాల్వలో పడేసి, అతడు నడిపి వచ్చిన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కాల్వ ఒడ్డున వదిలి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

రెండు రోజుల తర్వాత కాల్వలో మోను మృతదేహం లభించింది. శరీరంపై గాయాలు కనిపించకపోవడంతో పోలీసులు మొదట ప్రమాద మరణంగా కేసు నమోదు చేశారు. అంత్యక్రియల సమయంలో తన్ను కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి భర్త కోసం కన్నీళ్లు పెట్టుకోవడంతో ఎవరికీ ఆమెపై అనుమానం రాలేదు. అయితే, మోను మొబైల్‌ను కుటుంబ సభ్యులకు అప్పగించిన తర్వాత అందులోని కాల్ హిస్టరీ, చాట్స్ తొలగించి ఉండటం అనుమానాలకు దారితీసింది. డేటాను రికవరీ చేయించగా తన్ను, సోను మధ్య జరిగిన సంభాషణలు బయటపడ్డాయి. జూన్ 8న మాత్రమే సోను తన్నుకు 49 సార్లు ఫోన్ చేసినట్లు కూడా గుర్తించారు.

ఈ ఆధారాలతో కుటుంబ సభ్యులు ఉన్నతాధికారులను ఆశ్రయించగా జిల్లా ఎస్పీ ఆదేశాలపై పోలీసులు తన్ను, హరిఓమ్‌ను అరెస్ట్ చేశారు. విచారణలో తన్ను నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితుడు సోను, మరో నిందితుడు అమన్ ప్రస్తుతం పరారీలో ఉండగా, వారి కోసం గాలింపు కొనసాగుతోంది.

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు