క్రైమ్ మిర్రర్ : బీహార్‌లో మహానంద ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పిన ఘటన చోటుచేసుకుంది. రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా రైలు ఇంజిన్‌తో పాటు రెండు కోచ్‌ల చక్రాలు పట్టాలు తప్పాయి. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు చోటుచేసుకోలేదు. 15483 నంబర్ గల అలీపుర్దువార్ జంక్షన్–ఢిల్లీ సిక్కిం మహానంద ఎక్స్‌ప్రెస్ ఆదివారం తెల్లవారుజామున 4:12 గంటలకు ఆరా రైల్వే స్టేషన్‌లోని రెండో ప్లాట్‌ఫామ్‌కు చేరుకుంది. కొద్దిసేపటి తర్వాత ఢిల్లీ వైపు వెళ్లేందుకు రైలు స్టేషన్ నుంచి కదిలింది.
అదే సమయంలో సిగ్నలింగ్ వ్యవస్థలో సాంకేతిక సమస్య తలెత్తడంతో రైలుకు ససారం అప్‌లైన్ వైపు వెళ్లేలా సిగ్నల్ అందినట్లు అధికారులు గుర్తించారు. దీంతో రైలు ఆ దిశగా ముందుకు సాగింది. స్టేషన్ నుంచి సుమారు 200 మీటర్ల దూరం వెళ్లిన తర్వాత రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో రైలు ఇంజిన్‌తో పాటు ఎస్ఎల్ఆర్, హెచ్-1 కోచ్‌లకు చెందిన చక్రాలు ట్రాక్ నుంచి బయటకు వచ్చాయి. దీంతో సంబంధిత రైల్వే మార్గంలో రైళ్ల రాకపోకలకు కొంత అంతరాయం ఏర్పడింది.
సమాచారం అందుకున్న వెంటనే రైల్వే అధికారులు, సాంకేతిక నిపుణులు, సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. పట్టాలు తప్పిన ఇంజిన్, కోచ్‌లను తిరిగి ట్రాక్‌పైకి తీసుకువచ్చేందుకు పునరుద్ధరణ చర్యలు ప్రారంభించారు. సిగ్నల్ ససారం లైన్ వైపు మళ్లడానికి కారణమేంటి? రైలు నిర్దేశిత మార్గానికి బదులుగా మరో దిశలోకి ఎలా వెళ్లింది? అనే అంశాలపై అధికారులు విచారణ చేపట్టారు. సిగ్నలింగ్ వ్యవస్థలో తలెత్తిన లోపానికి సంబంధించిన పూర్తి వివరాలను దర్యాప్తు అనంతరం వెల్లడించనున్నారు.
also read : ఏటా ఒక డీఎస్సీ.. 2029 నాటికి మరో మూడు నోటిఫికేషన్లు: మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన
