క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు, ముఖ్యంగా ఉపాధ్యాయ వృత్తిని ఆశించే అభ్యర్థులకు రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఒక కీలకమైన తీపికబురు అందించారు. విజయవాడలో ఘనంగా జరిగిన బెస్ట్ టీచర్లకు అవార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని విద్యావ్యవస్థలో సమూల మార్పులు, సంస్కరణలు తెచ్చేందుకు తమ కూటమి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై స్పందిస్తూ, రాష్ట్రంలో ఇకపై ప్రతి సంవత్సరం డీఎస్సీ (DSC) నోటిఫికేషన్ ఇస్తామని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా 2029 నాటికి మరో మూడు డీఎస్సీ నోటిఫికేషన్లను విడుదల చేస్తామని ఆయన అధికారికంగా ప్రకటించారు.అదే సమయంలో ప్రతిపక్షాల తీరుపై మంత్రి లోకేష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అసలు డీఎస్సీకి, ఏపీపీఎస్సీకి (APPSC) మధ్య కనీస తేడా కూడా తెలియని వారు సైతం తమ ప్రభుత్వంపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ట్రాక్ రికార్డును ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో ఏకంగా 14 డీఎస్సీలు వేసిన ఘనత ఆయనకే దక్కుతుందని, తద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2 లక్షల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసి ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపారని లోకేష్ కొనియాడారు. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అదే స్పూర్తితో విద్యా రంగానికి పెద్దపీట వేస్తుందని ఆయన ఉద్ఘాటించారు. ఈ తాజా ప్రకటనతో డీఎస్సీ కోసం సన్నద్ధమవుతున్న లక్షలాది మంది అభ్యర్థుల్లో కొత్త ఆశలు చిగురించాయి.
