వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో వచ్చే రెండు రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా ఆదివారం, సోమవారం కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశముందని అధికారులు హెచ్చరించారు.
ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. అలాగే ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. శనివారం కామారెడ్డి జిల్లా బిక్నూర్‌లో అత్యధికంగా 5.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ములుగు జిల్లా మల్లంపల్లిలో 5.6 సెంటీమీటర్లు, సిద్దిపేట జిల్లా కొండపాకలో 5.4 సెంటీమీటర్లు, కామారెడ్డి జిల్లా లింగంపేటలో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో కూడా రోజంతా ముసురు వాతావరణంతో పాటు వర్షం కురిసింది.
మరోవైపు, రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో కామారెడ్డి జిల్లాలో సాధారణ జనజీవనంపై ప్రభావం కనిపిస్తోంది. ఎగువ ప్రాంతమైన మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తుండటంతో కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీకి వరద నీరు భారీగా చేరుతోంది. శనివారం సాయంత్రానికి బ్యారేజీకి సుమారు 75 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. ఆదివారం నాటికి ఇది లక్ష క్యూసెక్కులకు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అటు ములుగు జిల్లాలోని బొగత జలపాతం వద్ద నీటి ప్రవాహం పెరగడంతో పర్యాటకులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుంటున్నారు. జలపాతం అందాలను ఆస్వాదిస్తూ ఫొటోలు, సెల్ఫీలు దిగుతూ సందడి చేస్తున్నారు.