క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్న సిద్దిపేట జిల్లా కొండపాకలోని శ్రీ సత్యసాయి సంజీవని చైల్డ్ హార్ట్ కేర్ అండ్ రీసెర్చ్ సెంటర్‌కు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీష్ రావు తన ఏడాది ఎమ్మెల్యే వేతనాన్ని విరాళంగా అందజేస్తున్నట్లు ప్రకటించారు. ఆస్పత్రి నిర్వహిస్తున్న సేవలకు మద్దతుగా ఇదే రోజు చెక్కును కూడా అందజేస్తానని వెల్లడించారు.
శనివారం రోజున ఆస్పత్రిని సందర్శించిన హరీష్ రావుతో పాటు సినీ నటుడు విజయ్ దేవరకొండ కూడా డాక్టర్లతో మాట్లాడి.. ఆస్పత్రిలో అందుతున్న సేవల గురించి వివరాలు తెలుసుకున్నారు. పుట్టుకతోనే గుండె సంబంధిత సమస్యలు ఉన్న చిన్నారులకు ఉచితంగా శస్త్రచికిత్సలు చేసి కొత్త జీవితం అందిస్తున్న సత్యసాయి సంజీవని చైల్డ్ హార్ట్ కేర్ అండ్ రీసెర్చ్ సెంటర్ సేవలను అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్ రావు.. ఒక కుటుంబంలో బిడ్డ పుట్టడం ఎంతో ఆనందాన్నిస్తుందని.. కానీ అదే చిన్నారికి గుండెలో రంధ్రాలు ఉన్నాయని లేదా ప్రాణాపాయ స్థితిలో ఉందని డాక్టర్లు చెప్పిన క్షణం తల్లిదండ్రుల ప్రపంచమే కూలిపోతుందని భావోద్వేగంతో వ్యాఖ్యానించారు.
అలాంటి సమయంలో ఈ ఆస్పత్రి చిన్నారికి మాత్రమే కాదని.. తల్లిదండ్రుల ఆశలకు కూడా ఊపిరి పోస్తోందని పేర్కొన్నారు. ఆస్పత్రిలో ఒక చిన్నారికి గుండె శస్త్రచికిత్స చేయడం అంటే కేవలం ఒక ప్రాణాన్ని కాపాడటం కాదని.. ఆ బిడ్డతో పాటు తల్లిదండ్రుల జీవితాల్లోనూ కొత్త ఆశను నింపడంతోపాటు.. అందుకే తన దృష్టిలో ఈ ఆస్పత్రి ఒక వైద్యశాల మాత్రమే కాదని.. ఎంతోమంది కుటుంబాలకు ఆశాకిరణం, దేవాలయం లాంటిదని పేర్కొన్నారు.సామాజిక బాధ్యతలో భాగంగా తన ఏడాది వేతనాన్ని ఆస్పత్రికి విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు ఈ సందర్భంగా హరీష్ రావు వెల్లడించారు.