కేంద్ర మంత్రివర్గంలో త్వరలో పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో తెలంగాణకు కేంద్రంలో మరింత ప్రాధాన్యం దక్కే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండగా, మరో బీజేపీ నేతకు కూడా మంత్రి పదవి దక్కవచ్చని ప్రచారం సాగుతోంది.
అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగుదేశం పార్టీకి చెందిన మరో ఎంపీకి కూడా కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించే అవకాశం ఉందని సమాచారం. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే కుమారుడు, ఎంపీ శ్రీకాంత్ శిందే, జేడీయూ నేత నితీశ్ కుమార్ వర్గానికి చెందిన ప్రతినిధులు, తృణమూల్ కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన సుఖేందు శేఖర్ రాయ్‌లకు కూడా మంత్రి పదవులు దక్కవచ్చని చెబుతున్నారు.
మాజీ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్‌కు మరోసారి అవకాశం ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం రైల్వే శాఖతో పాటు సమాచార, ప్రసార శాఖను నిర్వహిస్తున్న అశ్వినీ వైష్ణవ్ నుంచి ఆ శాఖను తీసుకుని అనురాగ్ ఠాకూర్‌కు అప్పగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు శాఖ మార్పు ఉండొచ్చని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఆమెను విద్యాశాఖకు పంపించి, ఆర్థిక శాఖ బాధ్యతలను ఆర్‌బీఐ మాజీ గవర్నర్ శక్తికాంత దాస్‌కు అప్పగించే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా, పలువురు సీనియర్ మంత్రులను తప్పించి కొత్త ముఖాలకు అవకాశం కల్పించవచ్చని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ బాధ్యతల్లో కూడా మార్పులు ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ మార్పులపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం ఇవన్నీ రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చలుగానే ఉన్నాయి.