స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఆగస్టు 15న ఎర్రకోట వేదికగా జరగనున్న 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఎలాంటి ముప్పు తలెత్తకుండా ఢిల్లీ పోలీసులు, కేంద్ర భద్రతా బలగాలు విస్తృత స్థాయిలో భద్రతా చర్యలు చేపట్టాయి.
భద్రతా చర్యల్లో భాగంగా నిషేధిత ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్నట్లు పేర్కొంటున్న 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల వివరాలతో కూడిన పోస్టర్లను పోలీసులు విడుదల చేశారు. ఇండియన్ ముజాహిదీన్, అల్‌ఖైదా, ఖలిస్థానీ ఉగ్రవాద సంస్థలకు చెందిన అనుమానితుల వివరాలను ఈ పోస్టర్లలో పొందుపరిచినట్లు అధికారులు తెలిపారు.
ఢిల్లీలోని రద్దీ ప్రాంతాలు, ప్రధాన మార్కెట్లు, మెట్రో స్టేషన్లు, ప్రజలు అధికంగా సంచరించే ప్రాంతాల్లో ఈ పోస్టర్లను ఏర్పాటు చేస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలు కనిపించినా, పోస్టర్లలో ఉన్న వ్యక్తుల గురించి ఏదైనా సమాచారం తెలిసినా వెంటనే పోలీసులకు తెలియజేయాలని అధికారులు ప్రజలను కోరారు.
సమాచారం అందించే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని పోలీసులు తెలిపారు. విశ్వసనీయమైన సమాచారం అందించిన వారికి తగిన రివార్డు కూడా అందిస్తామని వెల్లడించారు.
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఢిల్లీలో ఇప్పటికే భద్రతా తనిఖీలు ముమ్మరం కాగా.. ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. ప్రజల భద్రతకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
also read: రైలు ఢీకొని వృద్ధుడి మృతి.. మృతదేహాన్ని కిలోమీటర్ మేర ఈడ్చుకెళ్లిన ట్రైన్
