మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. జాతకంలో ఉన్న దోషాన్ని తొలగిస్తానని నమ్మించి 17 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని రమేశ్వర్ రామ్‌దాసి మహారాజ్‌గా గుర్తించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. బాలిక జాతకంలో దోషం ఉందని, ప్రత్యేక పూజ నిర్వహిస్తే ఆ సమస్య తొలగిపోతుందని నిందితుడు ఆమె తల్లిదండ్రులను నమ్మించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పూజ పేరుతో బాలికను ఓ గదిలో ఒంటరిగా ఉంచి ఆమెపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ విషయం బయటకు చెబితే బాలికతో పాటు ఆమె కుటుంబానికి అరిష్టం జరుగుతుందని నిందితుడు బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. దీంతో బాలిక భయంతో జరిగిన విషయాన్ని ఎవరికీ చెప్పలేదని సమాచారం.
అయితే బాలిక గర్భవతి కావడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు.
ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. జాతక దోషాలు, పూజల పేరుతో ప్రజలను నమ్మించి మోసాలకు పాల్పడుతున్న వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
also read: రైళ్లలో చాక్లెట్ల రూపంలో గంజాయి అక్రమ రవాణా.. తుని రైల్వే పోలీసుల తనిఖీల్లో భారీగా పట్టివేత
