క్రైమ్ మిర్రర్ : మథురలోని బృందావన్‌లో ఉన్న ప్రేమానంద్ జీ మహారాజ్ ఆశ్రమంలో శనివారం ఉదయం విషాద ఘటన చోటుచేసుకుంది. ‘గురుకృపా కుంజ్’ ఆశ్రమం నాలుగో అంతస్తు నుంచి కిందపడటంతో ఓ శిష్యుడు తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. మృతుడిని మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్కు చెందిన దీపక్ లోధిగా పోలీసులు గుర్తించారు. ఆశ్రమంలో ఆయన ‘రసిక్ దులారీ శరణ్’ పేరుతో ఉంటున్నట్లు సమాచారం. ఉదయం సుమారు 10:30 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
నాలుగో అంతస్తు నుంచి పడిపోవడంతో దీపక్‌కు తలతో పాటు శరీరంలోని పలు భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. ఆశ్రమ ప్రతినిధులు వెంటనే ఆయనను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. ఆసుపత్రికి తరలించిన తర్వాత ఆశ్రమ నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఫోరెన్సిక్ నిపుణులు కూడా అక్కడ ఆధారాలను సేకరించారు.
మృతదేహాన్ని ప్రస్తుతం మార్చురీలో భద్రపరిచారు. జబల్పూర్లో ఉన్న దీపక్ కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. వారు ఆదివారం ఉదయం మథురకు చేరుకున్న అనంతరం పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమికంగా ఆత్మహత్య అనుమానం వ్యక్తమవుతున్నప్పటికీ, ప్రమాదం లేదా ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలోనూ విచారణ కొనసాగిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.
also read : నరసింహరాజు ఆసక్తికర విషయాలు.. ఆ విషయంలో అలా చేసి ఉంటే బాగుండేదంటూ వ్యాఖ్యలు!
