Homeతెలంగాణఆపరేషన్ కోసం ఆసుపత్రికి వెళ్తే ఇల్లు గుల్ల చేశారు.. ఖమ్మం జిల్లాలో దొంగల బీభత్సం!

ఆపరేషన్ కోసం ఆసుపత్రికి వెళ్తే ఇల్లు గుల్ల చేశారు.. ఖమ్మం జిల్లాలో దొంగల బీభత్సం!

క్రైమ్ మిర్రర్ : బాధితులు అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితిని ఆసరాగా చేసుకుని, ఖాళీగా ఉన్న ఇంటిని లక్ష్యంగా చేసుకున్న దొంగలు తమ చేతివాటం ప్రదర్శించారు. ఇంటి తలుపులు బద్దలు కొట్టి లక్షలాది రూపాయల విలువైన బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదును ఊడ్చేసిన ఘటన కారేపల్లి మండలంలో తీవ్ర కలకలం రేపింది.

బాధితులు, పోలీసు తెలిపిన వివరాల ప్రకారం.. కారేపల్లి మండల పరిధిలోని సీతారాంపురం గ్రామానికి చెందిన కుప్పనూరి వెంకటరెడ్డి అనారోగ్య సమస్యలతో ఆపరేషన్ నిమిత్తం మూడు రోజుల క్రితం ఆసుపత్రిలో చేరారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేకపోవడాన్ని గమనించిన గుర్తుతెలియని దుండగులు ఇంటి తలుపులు పగలగొట్టి లోపలికి చొరబడ్డారు. శనివారం ఉదయం వెంకటరెడ్డి భార్య ఇంటికి తిరిగి వచ్చి చూడగా, తలుపులు ధ్వంసమై ఉండటంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. లోపలికి వెళ్లేసరికి బీరువాలోని బంగారం, వెండి ఆభరణాలు, నగదు మాయమైనట్లు గుర్తించారు.

సుమారు 16 తులాల బంగారం, 20 తులాల వెండి ఆభరణాలతో పాటు కొంత నగదును దొంగలు అపహరించారని బాధితులు తెలిపారు. చోరీకి గురైన సొత్తు విలువ దాదాపు రూ.30 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. వెంటనే బాధితులు స్థానికుల సహాయంతో కారేపల్లి పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు. ఖమ్మం నుంచి క్లూస్ టీమ్‌ను రప్పించి వేలిముద్రలు, ఇతర కీలక ఆధారాలను సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, సంఘటనా స్థలంలో లభించిన ఆధారాలతో నిందితులను త్వరలోనే పట్టుకుంటామని స్థానిక ఎస్సై బైరు గోపి తెలిపారు.
also read : అంగన్‌వాడీల నుంచి నెలమామూళ్లు.. ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన సీడీపీవో!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు