రైలు ప్రయాణం అంటేనే ఎన్నో రకాల అనుభవాలు ఎదురవుతుంటాయి. సాధారణ ప్రయాణికులతో పాటు ప్రముఖులకు కూడా కొన్ని సందర్భాల్లో ఇబ్బందికర పరిస్థితులు తప్పడం లేదు. తాజాగా బెంగళూరు దక్షిణ ఎంపీ తేజస్వి సూర్య భార్య శివశ్రీ తన రైలు ప్రయాణంలో ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
ఇటీవల తాను రైలులో దాదాపు ఐదు గంటల పాటు ప్రయాణించినట్లు శివశ్రీ తెలిపారు. అయితే ఈ ప్రయాణంలో సుమారు నాలుగు గంటల పాటు తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొన్నానని పేర్కొన్నారు. ఒకే కోచ్‌లో సుమారు 56 మంది ప్రయాణికులు ఉండగా.. వారిలో దాదాపు 40 మంది పెద్దగా మాట్లాడటం, యువతులు, మహిళలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడం వంటి పరిణామాలు తనకు అసౌకర్యంగా అనిపించాయని ఆమె వివరించారు.
ఈ పరిస్థితుల్లో తాను మరో బోగీలో కూర్చునేందుకు అవకాశం కల్పించాలని కోరినట్లు శివశ్రీ తెలిపారు. అయితే ఇతర బోగీల్లో సీట్లు ఖాళీగా లేకపోవడంతో అదే కోచ్‌లో కొనసాగాల్సి వచ్చిందని చెప్పారు. దీంతో ఆ రైలు ప్రయాణం తనకు ఎంతో ఇబ్బందికరంగా మారిందని, నాలుగు గంటల పాటు మానసిక వేదనను అనుభవించాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
తనకు ఎదురైన ఈ అనుభవాన్ని సోషల్ మీడియాలో వెల్లడిస్తూ.. రైలు ప్రయాణాల్లో మహిళలకు ఎదురయ్యే అసౌకర్యాలపై శివశ్రీ ఆవేదన వ్యక్తం చేశారు . ఈ ఘటనపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.
also read: స్నాప్‌చాట్ ద్వారా పరిచయం- బాలికపై లైంగిక దాడికి పాల్పడిన యువకుడు
