క్రైమ్ మిర్రర్ : జీడిమెట్ల ఆర్టీసీ డిపోలో మంగళవారం ఉదయం విషాద ఘటన చోటుచేసుకుంది. బస్సు మరమ్మతులు చేస్తుండగా జరిగిన ప్రమాదంలో ఆర్టీసీ మెకానిక్ సంతోష్ కుమార్ (39) మృతి చెందారు. విధుల్లో భాగంగా బస్సును పరిశీలిస్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది.డిపోలోని మెట్రో డీలక్స్ బస్సుకు బ్రేక్‌లో సమస్య తలెత్తడంతో సంతోష్ కుమార్ దాని మరమ్మతులు చేపట్టారు. బస్సు కిందకు వెళ్లి రిపేర్ పనులు పూర్తి చేసిన అనంతరం బయటకు వస్తున్న సమయంలో ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం.
మెకానిక్ బస్సు కింద ఉన్న విషయాన్ని గమనించకపోవడంతో డ్రైవర్ వాహనాన్ని ముందుకు కదిలించినట్లు తెలుస్తోంది. దీంతో సంతోష్ కుమార్ బస్సు చక్రాల కింద చిక్కుకుని తీవ్రంగా గాయపడ్డారు. ఘటన జరిగిన వెంటనే తోటి సిబ్బంది అప్రమత్తమైనప్పటికీ అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే డిపోకు చేరుకుని ఘటనపై వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు, డ్రైవర్ నిర్లక్ష్యం ఏమైనా ఉందా అనే అంశాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ ఘటనతో జీడిమెట్ల ఆర్టీసీ డిపోలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సంతోష్ కుమార్ మృతితో సహచర ఉద్యోగులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
also read : గనిలో ఘోర ప్రమాదం.. 14 మంది మృతి
