తెలంగాణలోని పేద కుటుంబాలకు చెందిన వధువులకు ఆర్థిక భరోసా కల్పిస్తున్న కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ పథకాల అమలుకు చట్టబద్ధమైన ఆధారం లేదంటూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం.. తదుపరి విచారణ వరకు పథకాల కింద ఎలాంటి చెల్లింపులు చేయవద్దని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
పథకాలపై కోర్టును ఆశ్రయించిన న్యాయవాది
కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు శాసనసభ ద్వారా చట్టబద్ధత కల్పించకుండా కేవలం ప్రభుత్వ ఉత్తర్వుల ఆధారంగా అమలు చేస్తున్నారని పేర్కొంటూ న్యాయవాది విజయ్ గోపాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పథకాల కోసం పెద్ద మొత్తంలో ప్రజాధనం ఖర్చు చేయడం రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధమని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఈ పిటిషన్‌పై జస్టిస్ ఎన్.వీ. శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది.. చట్టపరమైన అనుమతి లేకుండా కేవలం జీవోల ఆధారంగా పథకాలను అమలు చేయడం, ప్రజా నిధులను ఖర్చు చేయడం సమర్థనీయం కాదని వాదించారు.
ప్రభుత్వ స్పందనపై కోర్టు ఆరా
ఈ వ్యవహారంపై గతంలో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించినప్పటికీ ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. పథకాల అర్హత ప్రమాణాలు, ఆదాయ పరిమితులు తదితర అంశాలను ఏ ప్రాతిపదికన నిర్ణయించారనే దానిపైనా స్పష్టత అవసరమని వాదించారు.
వాదనలు విన్న అనంతరం హైకోర్టు ధర్మాసనం.. తదుపరి విచారణ వరకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద ఎలాంటి చెల్లింపులు చేయరాదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కేసు విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. తదుపరి విచారణ సెప్టెంబర్ 9న జరగనుంది.
2014లో ప్రారంభమైన పథకాలు
పేద కుటుంబాలకు చెందిన యువతుల వివాహ సమయంలో ఆర్థిక సహాయం అందించాలనే ఉద్దేశంతో 2014లో అప్పటి తెలంగాణ ప్రభుత్వం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రారంభించింది. తొలుత ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన లబ్ధిదారులకు పథకాలను వర్తింపజేశారు. అనంతరం బీసీ, ఈబీసీ వర్గాలకు కూడా పరిధిని విస్తరించారు.
ప్రస్తుతం అర్హత కలిగిన లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.1,00,116 ఆర్థిక సహాయం అందుతోంది. వధువుకు కనీసం 18 సంవత్సరాల వయసు ఉండాలనే నిబంధనను కూడా అమలు చేస్తున్నారు. బాల్య వివాహాలను నిరోధించడంలో ఈ నిబంధన ఉపయోగపడుతుందని ప్రభుత్వం పేర్కొంటూ వచ్చింది.
లబ్ధిదారుల్లో ఆందోళన
హైకోర్టు తాజా ఆదేశాలతో ఇప్పటికే ఈ పథకాల కింద దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది. పెళ్లిళ్ల సమయంలో ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తున్న కుటుంబాలకు తాజా పరిణామం ఇబ్బందికరంగా మారింది. అయితే తదుపరి విచారణలో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు కీలకంగా మారింది.
also read: నటి షకీలాకు మెడ సంబంధిత శస్త్రచికిత్స… స్మార్ట్‌ఫోన్ వినియోగమే కారణమంటున్న నటి
