Homeవైరల్కేటీఆర్ ప్రశంసలు.. ప్రియదర్శి రిప్లై.. సోషల్ మీడియాలో ‘ప్యారడైజ్’పై ఆసక్తికర సంభాషణ

కేటీఆర్ ప్రశంసలు.. ప్రియదర్శి రిప్లై.. సోషల్ మీడియాలో ‘ప్యారడైజ్’పై ఆసక్తికర సంభాషణ

నేచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని వీక్షించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. సినిమా, నటీనటులపై సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ముఖ్యంగా ప్రియదర్శి నటనను ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. దీనికి నటుడు ప్రియదర్శి స్పందిస్తూ కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. వీరిద్దరి మధ్య జరిగిన ఈ సోషల్ మీడియా సంభాషణ ప్రస్తుతం ఆసక్తిని కలిగిస్తోంది.

‘ది ప్యారడైజ్’లో ఆత్మగౌరవం, అణచివేతకు వ్యతిరేకంగా తిరుగుబాటు వంటి అంశాలను దర్శకుడు శ్రీకాంత్ ఓదెల చూపించిన తీరును కేటీఆర్ ప్రశంసించారు. అవసరమైన సమయంలో సాధారణంగా కనిపించే వ్యక్తులు కూడా బలంగా ఎదిరించగలరనే సందేశాన్ని సినిమా అందించిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ ఓదెలకు అభినందనలు తెలిపిన కేటీఆర్.. ప్రధాన పాత్రలో నటించిన నానికి శుభాకాంక్షలు చెప్పారు. అలాగే ప్రియదర్శికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.

కేటీఆర్ చేసిన ఈ పోస్టుకు ప్రియదర్శి స్పందించారు. ‘పెళ్లిచూపులు’ నుంచి ‘ది ప్యారడైజ్’ వరకు తన సినిమాలపై కేటీఆర్ చూపిస్తున్న ఆదరణకు ధన్యవాదాలు తెలిపారు. తన సినిమాలను ప్రోత్సహిస్తూ వస్తున్నందుకు కృతజ్ఞతలు వ్యక్తం చేస్తూ.. కేటీఆర్‌ను ఆప్యాయంగా సంబోధిస్తూ రిప్లై ఇచ్చారు.

ఇక ‘ది ప్యారడైజ్’లో ప్రియదర్శి పోషించిన ‘ఎమ్మెల్యే శంకరన్న’ పాత్ర కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ పాత్ర ఆహార్యం, హావభావాలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను పోలి ఉన్నాయంటూ సోషల్ మీడియాలో పలువురు చర్చిస్తున్నారు. అయితే శంకరన్న పాత్రపై దర్శకుడు శ్రీకాంత్ ఓదెల గతంలోనే వివరణ ఇచ్చారు. తెలంగాణలో తనకు ఎదురైన అనుభవాల ఆధారంగా రూపొందించిన కల్పిత కథలో భాగంగానే ఈ పాత్రను తీర్చిదిద్దినట్లు ఆయన పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో కేటీఆర్.. ముఖ్యంగా ప్రియదర్శి పోషించిన శంకరన్న పాత్రను ప్రశంసించడం సినిమాపై జరుగుతున్న చర్చకు మరింత ఆసక్తిని జోడించింది. ప్రస్తుతం కేటీఆర్ ప్రశంసలు, ప్రియదర్శి స్పందన సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.

also read: విజయవాడలో విషాదం.. విధుల్లోనే సీఐ అహ్మద్ అలీ మృతి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు