హైదరాబాద్ సూరారం పరిధిలోని సాయిబాబా నగర్‌లో ఓ ప్రైవేటు పాఠశాల ప్రిన్సిపాల్ వ్యవహారం కలకలం రేపింది. తన వద్ద పనిచేసే ఉపాధ్యాయురాలిని వేధించాడనే ఆరోపణల నేపథ్యంలో ఆమె కుటుంబ సభ్యులు, స్థానికులు ప్రిన్సిపాల్‌ను నిలదీయగా.. అతడు కత్తితో దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
వివరాల్లోకి వెళ్తే.. సాయిబాబా నగర్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలిని అదే పాఠశాల ప్రిన్సిపాల్ కొంతకాలంగా మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఆమె ఫోన్ నంబర్‌ను అసభ్యకరమైన పేరుతో సేవ్ చేసుకుని ఇబ్బందులకు గురిచేసినట్లు సమాచారం. ఈ వేధింపులతో తీవ్రంగా ఇబ్బందిపడిన ఉపాధ్యాయురాలు పాఠశాలకు వెళ్లడం మానేసింది.
ఆమె ప్రవర్తనలో మార్పును గమనించిన కుటుంబ సభ్యులు ఆరా తీయడంతో అసలు విషయం బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో బాధితురాలి సోదరుడు, కొందరు స్థానికులతో కలిసి పాఠశాలకు వెళ్లి ప్రిన్సిపాల్‌ను ఈ వ్యవహారంపై ప్రశ్నించారు.
ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి వివాదం తలెత్తింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ప్రిన్సిపాల్ కత్తితో దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం ఇరువర్గాలను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఈ ఘటనకు సంబంధించి ప్రిన్సిపాల్‌పై కత్తితో దాడి చేసిన కేసు నమోదు చేయగా.. పాఠశాలపై మూకుమ్మడిగా దాడికి ప్రయత్నించారనే ఆరోపణలతో కొందరు కాలనీవాసులపై కూడా పోలీసులు వేర్వేరుగా కేసులు నమోదు చేసినట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
also read: చిట్టీల పేరుతో రూ.10 కోట్లకు పైగా వసూలు చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు.. ఆపై కుటుంబంతో కలిసి పరారీ
