చిట్టీల వ్యాపారం పేరుతో పలువురి నుంచి రూ.10 కోట్లకు పైగా డబ్బులు వసూలు చేసిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు కుటుంబ సభ్యులతో కలిసి అదృశ్యమైన ఘటన సూర్యాపేట జిల్లాలో కలకలం రేపుతోంది. బాధితులు జిల్లా ఎస్పీ నరసింహను కలిసి ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
చివ్వెంల మండలం ఏనేగండి తండాకు చెందిన వ్యక్తి ఆత్మకూర్ (ఎస్) మండలం శెట్టిగూడెం పాఠశాలలో ఎస్జీటీగా విధులు నిర్వహిస్తున్నాడు. సూర్యాపేటలోని విద్యానగర్‌లో అద్దె ఇంట్లో ఉంటూ సుమారు ఆరేళ్లుగా చిట్టీల వ్యవహారం నడిపినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. తన స్వగ్రామంతో పాటు చుట్టుపక్కల 12 గ్రామాలకు చెందిన ప్రజలు, బంధువులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగుల వద్ద నుంచి డబ్బులు సేకరించినట్లు చెబుతున్నారు.
బాధితుల వివరాల ప్రకారం.. ఒక్కొక్కరి నుంచి రూ.లక్ష నుంచి రూ.1.30 కోట్ల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కొందరికి ప్రామిసరీ నోట్లు రాసి ఇవ్వగా.. మరికొందరికి నెలనెలా అధిక మొత్తంలో లాభాలు ఇస్తానని నమ్మించినట్లు సమాచారం. ఇలా మొత్తంగా రూ.10 కోట్లకు పైగా సేకరించినట్లు బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు.
గత ఏడాది కాలంగా తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని బాధితులు ఒత్తిడి చేయడంతో నిందితుడు వాయిదాలు వేస్తూ వచ్చాడని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ముందుగానే ప్రణాళిక వేసుకుని పరారైనట్లు బాధితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
తనకు ఉన్న నాలుగు ఎకరాల భూమిలో ఎక్కువ భాగాన్ని ఇతరుల పేర్లపై రిజిస్ట్రేషన్ చేయించినట్లు సమాచారం. తన పేరుపై కేవలం 13 గుంటల భూమి మాత్రమే ఉంచుకున్నట్లు బాధితులు చెబుతున్నారు.
సుమారు పది రోజుల క్రితం హైదరాబాద్‌లో ఓ ముఖ్యమైన వ్యక్తిని కలవాల్సి ఉందంటూ ఇద్దరు గ్రామస్థులను తన వెంట తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ ఓ హోటల్‌లో కూర్చొని తాను అప్పుల్లో చిక్కుకున్నానని వారితో చెప్పిన అనంతరం, కొద్దిసేపట్లో తిరిగి వస్తానని చెప్పి బయటకు వెళ్లినట్లు సమాచారం. అయితే ఆ తర్వాత ఆయన తిరిగి రాలేదు.
దీంతో అనుమానం వచ్చిన బాధితులు సూర్యాపేటలోని ఆయన నివాసంతో పాటు ఏనేగండి తండాలోని ఇంటికి వెళ్లి చూడగా రెండుచోట్లా తాళాలు వేసి ఉన్నట్లు గుర్తించారు. దీంతో తాము మోసపోయినట్లు భావించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భారీ మొత్తంలో వసూలు చేసిన డబ్బును నిందితుడు ఎక్కడికి తరలించాడు? ఆస్తులను ఇతరుల పేర్లపై ఎందుకు రిజిస్ట్రేషన్ చేయించాడు? కుటుంబ సభ్యులు కూడా పరారీలో ఉన్నారా? అనే అంశాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
