Homeజాతీయంతుపాకీ పట్టిన చేతులే.. ర్యాంప్‌పై మోడల్స్‌గా మాజీ మహిళా మావోయిస్టులు

తుపాకీ పట్టిన చేతులే.. ర్యాంప్‌పై మోడల్స్‌గా మాజీ మహిళా మావోయిస్టులు

క్రైమ్ మిర్రర్ : మావోయిస్టులు, నక్సలైట్లు అంటే సాధారణంగా దట్టమైన అడవులు, ఆయుధాలు, హింసాత్మక పోరాటాలు గుర్తుకొస్తాయి. కానీ ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పూర్‌లో చోటుచేసుకున్న ఓ ప్రత్యేక కార్యక్రమం ఈ దృశ్యానికి భిన్నమైన చిత్రాన్ని ఆవిష్కరించింది. ఒకప్పుడు బస్తర్‌ అడవుల్లో మావోయిస్టు ఉద్యమంలో పనిచేసిన మాజీ మహిళా మావోయిస్టులు ఇప్పుడు ఆయుధాలను వదిలి సాధారణ జీవితంలోకి అడుగుపెట్టారు. అంతేకాదు.. చేనేత దుస్తులు ధరించి ఫ్యాషన్‌ ర్యాంప్‌పై ఆత్మవిశ్వాసంతో నడిచి అందరి ప్రశంసలు అందుకున్నారు.

  • చేనేత దుస్తుల్లో ర్యాంప్‌పై సందడి

జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని రాయ్‌పూర్‌లోని పండిత్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ ఆడిటోరియంలో ప్రత్యేక గిరిజన ఫ్యాషన్‌ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వానికి లొంగిపోయి పునరావాసం పొందుతున్న పలువురు మాజీ మహిళా మావోయిస్టులు పాల్గొన్నారు. ఛత్తీస్‌గఢ్‌ సంప్రదాయానికి ప్రతీకగా నిలిచే చేనేత వస్త్రాలు, కోసా సిల్క్‌ చీరలు ధరించి వారు ర్యాంప్‌పై నడిచారు. ఒకప్పుడు చేతిలో ఆయుధాలతో అడవుల్లో తిరిగిన మహిళలు.. అదే చేతులతో ఇప్పుడు తమ సంప్రదాయ దుస్తులను ప్రదర్శిస్తూ ర్యాంప్‌పై కనిపించడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వారు ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ర్యాంప్‌ వాక్‌ చేస్తుండగా ప్రేక్షకులు చప్పట్లతో వారిని అభినందించారు.

  • హింస నుంచి సాధారణ జీవితం వైపు..

ఈ కార్యక్రమాన్ని కేవలం ఫ్యాషన్‌ షోగా చూడలేమని నిర్వాహకులు పేర్కొన్నారు. హింసాత్మక మార్గాన్ని విడిచిపెట్టి సమాజంలో గౌరవప్రదమైన జీవితం గడపాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న మహిళలకు ఇది ఒక కొత్త గుర్తింపుగా నిలిచింది. పునరావాసం ద్వారా జీవితాన్ని మార్చుకున్న వారు తమలోని ప్రతిభను, ఆత్మవిశ్వాసాన్ని ప్రపంచానికి చాటే అవకాశం లభించింది. ఈ కార్యక్రమానికి ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి విష్ణుదేవ్‌ సాయ్‌ కూడా హాజరయ్యారు. మాజీ మహిళా మావోయిస్టులతో ఆయన మాట్లాడి వారి అనుభవాలను తెలుసుకున్నారు. కొత్త జీవితంలో మరింత ముందుకు సాగాలని వారికి ప్రోత్సాహం అందించారు.

  • సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన దృశ్యాలు

ఆగస్టు 7న నిర్వహించిన ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. మాజీ మహిళా మావోయిస్టులు చేనేత దుస్తుల్లో ర్యాంప్‌పై నడుస్తున్న దృశ్యాలు నెటిజన్లను ఆకట్టుకున్నాయి. గత జీవితాన్ని వదిలి సాధారణ సమాజంలోకి వచ్చి తమకంటూ కొత్త గుర్తింపును ఏర్పరుచుకుంటున్న తీరుపై పలువురు ప్రశంసలు కురిపించారు. ఒకప్పుడు తుపాకీ, హింసతో ముడిపడిన జీవితాన్ని గడిపిన మహిళలు.. ఇప్పుడు స్వయం సమృద్ధి, గౌరవప్రదమైన జీవనం, సంప్రదాయ కళలు, చేనేత వంటి రంగాలతో అనుసంధానమవుతున్నారు. వారి మార్పు కేవలం వ్యక్తిగత జీవితాల్లో వచ్చిన పరిణామం మాత్రమే కాకుండా.. పునరావాసం ద్వారా సమాజంలోకి తిరిగి చేరుతున్న వారి కొత్త ప్రయాణానికి ప్రతీకగా నిలిచింది.

Also read : కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌కు హైకోర్టు బ్రేక్.. చెల్లింపులపై కీలక ఆదేశాలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు