క్రైమ్ మిర్రర్ : గీసుగొండ మండలం శాయంపేట శివారులోని కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కులో గురువారం విషాద ఘటన చోటుచేసుకుంది. పార్కులోని గణేశా ఎకోపెట్ క్లాత్ ఫ్యాక్టరీలో లిఫ్ట్‌లో చిక్కుకుని ఇద్దరు సాంకేతిక సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో ఫ్యాక్టరీలో విషాద వాతావరణం నెలకొంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన అభిలాష్ (30), సూర్యప్రకాశ్ (31) ఫ్యాక్టరీలో సాంకేతిక నిపుణులుగా పనిచేస్తున్నారు. గురువారం విధుల్లో భాగంగా లిఫ్ట్ వద్దకు వెళ్లిన సమయంలో ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రమాదవశాత్తూ ఇద్దరూ లిఫ్ట్‌లో చిక్కుకుపోవడంతో తీవ్ర అస్వస్థతకు గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం.
లిఫ్ట్‌లో విద్యుత్ సమస్య లేదా షార్ట్‌సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ప్రమాదానికి అసలు కారణం ఏమిటన్నది దర్యాప్తు పూర్తయిన తర్వాతే స్పష్టమవుతుందని అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించడంతో పాటు ఫ్యాక్టరీ సిబ్బందిని విచారించారు. లిఫ్ట్ ఎలా పనిచేయడం ఆగిపోయింది? విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ జరిగిందా? లిఫ్ట్‌లో భద్రతా ప్రమాణాలు పాటించారా? అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. దర్యాప్తు అనంతరం ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
also read : తుపాకీ పట్టిన చేతులే.. ర్యాంప్‌పై మోడల్స్‌గా మాజీ మహిళా మావోయిస్టులు
