క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యార్థులకు ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించిన రూ.258 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మొత్తాన్ని ఇప్పటికే కాలేజీల ఖాతాల్లో జమ చేసినట్లు అధికారులు తెలిపారు. దీంతో చాలా కాలంగా ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు, కళాశాలలకు ఊరట లభించింది. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల ఉన్నత విద్యకు ప్రాధాన్యం ఇస్తూ దశలవారీగా బకాయిలను చెల్లిస్తోంది. ఇప్పటివరకు రూ.4 వేల కోట్లకు పైగా పెండింగ్ బకాయిలను విడతల వారీగా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి నెలలో కూడా ప్రభుత్వం దాదాపు రూ.1,200 కోట్లను విడుదల చేసి విద్యాసంస్థలకు చెల్లింపులు చేసింది.
గతంలో ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తాన్ని విద్యార్థుల తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసేవారు. అయితే ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వం కొత్త విధానాన్ని అమలు చేస్తోంది. ఇప్పుడు డబ్బులను నేరుగా కాలేజీల అకౌంట్లలోనే జమ చేస్తున్నారు. దీని వల్ల చెల్లింపులు వేగంగా పూర్తవుతున్నాయని అధికారులు చెబుతున్నారు.ఈ నిర్ణయంతో విద్యార్థులపై ఆర్థిక భారం కొంత తగ్గనుంది. ముఖ్యంగా పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఉన్నత విద్యను కొనసాగించేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతోంది. ఫీజులు పెరిగిన ఈ కాలంలో ప్రభుత్వ సహాయం విద్యార్థులకు పెద్ద మద్దతుగా మారింది. అలాగే కాలేజీలు కూడా ఫీజు బకాయిల కారణంగా ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంది. ప్రభుత్వం సమయానికి నిధులు విడుదల చేస్తే విద్యాసంస్థలు మరింత మెరుగైన సదుపాయాలు కల్పించగలవని విద్యా రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.