Homeఆంధ్ర ప్రదేశ్తెలుగు ప్రజలకు గుడ్ న్యూస్.. ఏపీలోకి ప్రవేశించిన రుతుపవనాలు!

తెలుగు ప్రజలకు గుడ్ న్యూస్.. ఏపీలోకి ప్రవేశించిన రుతుపవనాలు!

ఏపీలోకి నైరుతి రుతుపవనాలు అడుగు పెట్టాయి. గత కొన్ని రోజులుగా తీవ్ర ఎండలు, వడగాడ్పులతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయి. భారత వాతావరణ శాఖ (IMD)  వివరాల ప్రకారం నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌లోకి అడుగుపెట్టాయి.  ప్రస్తుతం రాయలసీమలోని అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు జిల్లాలతో పాటు దక్షిణ కోస్తాలోని నెల్లూరు జిల్లాలో కొన్ని ప్రాంతాల వరకు రుతుపవనాలు విస్తరించాయి. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో రాబోయే రెండు నుంచి మూడు రోజుల్లో రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు అవి విస్తరించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ఉత్తర కేరళ ప్రాంతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, భూమధ్యరేఖ ప్రాంతం నుంచి హిందూ మహాసముద్రం వైపు తేమగాలులు వీస్తుండటం వల్ల రుతుపవనాల పురోగతి వేగంగా కొనసాగుతోందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అరేబియా సముద్రంలోని పలు ప్రాంతాలు, గోవా, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడులోని చెన్నై వరకు, అలాగే బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాల వరకు రుతుపవనాలు విస్తరించాయి.

మరో 5 రోజుల్లో దక్షిణ రాష్ట్రాల్లోకి విస్తరణ

మరో నాలుగు నుంచి ఐదు రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ఎక్కువ ప్రాంతాలు, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ ప్రాంతాలకు కూడా రుతుపవనాలు చేరే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ లెక్కన చూస్తే వచ్చే కొద్ది రోజుల్లో ఏపీ మొత్తం లేదా అధిక భాగం రుతుపవనాల ప్రభావంలోకి వచ్చే అవకాశం ఉంది.

ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు

సాధారణంగా జూన్ 5 నాటికి అనంతపురం, నెల్లూరు జిల్లాల వరకు రుతుపవనాలు చేరాల్సి ఉండగా, ఈసారి స్వల్ప ఆలస్యంతో రాష్ట్రంలోకి ప్రవేశించాయి. గత ఏడాది మాత్రం మే నెల చివరి వారానికే రాయలసీమ, కోస్తా ప్రాంతాల్లోని అనేక ప్రాంతాలకు విస్తరించాయి. రుతుపవనాల రాకతో ఆదివారం అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖతెలిపింది.

ఇదిలా ఉండగా, ఈ ఏడాది సాధారణం కంటే వర్షపాతం తక్కువగా ఉండే అవకాశం ఉన్నందున రైతులు ఖరీఫ్‌ పంటల సాగులో జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ సూచించింది. వర్షాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పంటల ఎంపిక చేసుకోవాలని రైతులకు సూచనలు జారీ చేసింది.

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

తాజావార్తలు