Homeజాతీయంపైలట్ ఆలస్యంతో గంటసేపు నిలిచిపోయిన ఇండిగో విమానం… ప్రయాణికుల ఆగ్రహం, ఎంపీ బెనివాల్ ప్రశ్నలు

పైలట్ ఆలస్యంతో గంటసేపు నిలిచిపోయిన ఇండిగో విమానం… ప్రయాణికుల ఆగ్రహం, ఎంపీ బెనివాల్ ప్రశ్నలు

ఢిల్లీ నుంచి జైపూర్‌కు వెళ్లాల్సిన ఇండిగో విమానంలో ఊహించని ఆలస్యం చోటుచేసుకుని ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించింది. పైలట్ సమయానికి విమానాశ్రయానికి చేరుకోకపోవడంతో, విమానం టేకాఫ్ ఆలస్యమైంది. ఈ ఘటనలో 175 మందికి పైగా ప్రయాణికులు దాదాపు గంటపాటు విమానంలోనే వేచి ఉండాల్సి వచ్చింది.

శుక్రవారం రాత్రి ఢిల్లీలోని టెర్మినల్-1 నుంచి బయలుదేరాల్సిన ఇండిగో విమానం 6E 6131, షెడ్యూల్ ప్రకారం రాత్రి 8:20 గంటలకు టేకాఫ్ కావాల్సి ఉంది. అయితే పైలట్ ఆలస్యంగా రావడంతో విమానం చివరకు రాత్రి 9:09 గంటలకు బయలుదేరింది.

ఈ విమానంలో రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్ పార్టీ వ్యవస్థాపకుడు, ఎంపీ హనుమాన్ బెనివాల్ కూడా ప్రయాణిస్తున్నారు. ఈ ఘటనపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. “వాతావరణం, ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో పెట్టుకుని నేను ముందుగానే బయలుదేరాను. అయితే పైలట్ ఎందుకు ముందుగా రాలేదు?” అని ప్రశ్నించారు.

ప్రయాణికులు విమానంలో కూర్చున్న తర్వాత కూడా ఎక్కువసేపు విమానం కదలకపోవడంతో సిబ్బందిని ప్రశ్నించగా, పైలట్ ఇంకా రాలేదని తెలిసిందని ఆయన తెలిపారు. “ప్రయాణికులు ఆలస్యంగా వస్తే విమానం ఆగదు. మరి పైలట్ ఆలస్యమైతే ఎలా?” అంటూ విమానయాన సంస్థపై విమర్శలు గుప్పించారు. ఈ విషయంపై కేంద్ర పౌర విమానయాన శాఖ దృష్టి సారించాలని కూడా కోరారు.

తరువాత మరో ఇండిగో విమానం ఢిల్లీకి చేరుకున్న తర్వాత, ఆ విమానం పైలట్‌ను ఈ ఫ్లైట్‌కు పంపించి ప్రయాణం కొనసాగించినట్లు సమాచారం.

ఇదిలా ఉంటే, ఈ ఘటనపై ఇండిగో స్పందిస్తూ భారీ వర్షాల కారణంగా ఢిల్లీలో తీవ్ర ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయని, అందువల్లే పైలట్ ఆలస్యమైందని పేర్కొంది. ప్రయాణికులకు పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు సమాచారం అందించినట్లు కంపెనీ వివరణ ఇచ్చింది.

also read: సోషల్ మీడియాకు గుడ్‌బై చెప్పిన మమితా బైజు.. మానసిక ప్రశాంతతే ముఖ్యం అంటున్న స్టార్ హీరోయిన్

తాజావార్తలు