Homeక్రైమ్వైద్య విద్యార్థిని ప్రియాంక కేసు- ‘హత్యాయత్నం’గా నమోదు చేయాలంటూ తండ్రి ఫిర్యాదు

వైద్య విద్యార్థిని ప్రియాంక కేసు- ‘హత్యాయత్నం’గా నమోదు చేయాలంటూ తండ్రి ఫిర్యాదు

వైద్య విద్యార్థిని ప్రియాంకపై జరిగిన దాడి కేసు కొత్త మలుపు తిరిగింది. ఇది సాధారణ రోడ్డు ప్రమాదం కాదని, ఉద్దేశపూర్వకంగా చేసిన హత్యాయత్నమని ఆరోపిస్తూ బాధితురాలి తండ్రి వెంకటేశ్ పోలీసులకు అధికారిక ఫిర్యాదు చేశారు. నిందితులు సూరావరపు దస్వంత్, ఆండ్రూ జోసఫ్ అడ్వర్డ్స్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ నెల 3వ తేదీ రాత్రి రాజమహేంద్రవరం నగరంలో జరిగిన ఈ ఘటనలో, ప్రియాంక ప్రయాణిస్తున్న స్కూటీని నిందితులు కారుతో ఢీకొట్టినట్లు తెలుస్తోంది. అయితే ఇది ఒక్కసారి జరిగిన ప్రమాదం కాదని, మద్యం మత్తులో ఉన్న నిందితులు అత్యంత వేగంగా కారు నడుపుతూ ఆమెను వరుసగా మూడుసార్లు ఢీకొట్టారని తండ్రి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ప్రస్తుతం పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు తేలికగా ఉన్నాయని, ఈ ఘటన తీవ్రతను దృష్టిలో ఉంచుకుని హత్యాయత్నం కేసుగా మార్చాలని వెంకటేశ్ విజ్ఞప్తి చేశారు. ఆయన ఫిర్యాదుతో ఉన్నతాధికారులు వెంటనే స్పందించారు. అదనపు ఎస్పీ పాటిల్, డీఎస్పీ సుభాష్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని బాధితురాలి కుటుంబంతో మాట్లాడారు. కేసు స్వభావాన్ని పరిశీలించి, చట్టపరమైన మార్పులపై ఆలోచిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఇదిలా ఉండగా, ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ప్రియాంక ఆరోగ్యం విషమంగానే ఉంది. ఆమెను మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. బాధితురాలికి న్యాయం చేయాలని, నిందితులకు కఠిన శిక్ష పడాలని ప్రజలు కోరుతున్నారు.

also read: పైలట్ ఆలస్యంతో గంటసేపు నిలిచిపోయిన ఇండిగో విమానం… ప్రయాణికుల ఆగ్రహం, ఎంపీ బెనివాల్ ప్రశ్నలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు