నగరంలోని మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఉదయం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అల్పా హోటల్ ఎదురుగా ఉన్న ప్రేమ్ స్పోర్ట్స్ షాప్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.
దుకాణం నుంచి పెద్దఎత్తున దట్టమైన పొగలు వెలువడటాన్ని గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. అనంతరం మంటలు మరింత విస్తరించకుండా చర్యలు చేపట్టి కొద్దిసేపట్లోనే అదుపులోకి తీసుకువచ్చారు.
అయితే ప్రమాదం జరిగిన సమయంలో ఉదయం కావడంతో స్పోర్ట్స్ షాప్‌లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు, దుకాణంలో జరిగిన ఆస్తి నష్టం వివరాలపై సంబంధిత అధికారులు పరిశీలిస్తున్నారు.
also read: చీఫ్ జస్టిస్ ఫొటోతో శ్మశానంలో క్షుద్రపూజలు.. బెయిల్ కోసం నలుగురి వింత ప్రయత్నం!
