బెయిల్ కోసం కొందరు వ్యక్తులు చేసిన వింత ప్రయత్నం ఛత్తీస్‌గఢ్‌లో కలకలం రేపింది. హత్యాయత్నం కేసులో జైలులో ఉన్న తమ బంధువుకు బెయిల్ రావాలని కోరుతూ నలుగురు వ్యక్తులు ఏకంగా హైకోర్టు చీఫ్ జస్టిస్ ఫొటోను ఉపయోగించి తాంత్రిక పూజలు నిర్వహించిన ఘటన బిలాస్‌పూర్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది.
పోలీసుల వివరాల ప్రకారం.. నలుగురు వ్యక్తులు అర్ధరాత్రి సమయంలో ఓ శ్మశానవాటికకు చేరుకున్నారు. అక్కడ తాంత్రికుడి సూచనల మేరకు ప్రత్యేక పూజలు చేస్తున్న సమయంలో స్థానికుల కంటపడ్డారు. అనుమానం రావడంతో స్థానికులు వారిని ప్రశ్నించగా.. ముగ్గురు అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయారు. మరో వ్యక్తిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
విచారణలో పట్టుబడిన వ్యక్తి కీలక విషయాలను వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. జైలులో ఉన్న తమ బంధువుకు బెయిల్ రావాలనే ఉద్దేశంతో తాంత్రికుడి సలహా మేరకు ఈ పూజలు నిర్వహించినట్లు అతడు చెప్పినట్లు సమాచారం.
ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు అక్కడి నుంచి పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. చేప, నిమ్మకాయలు, కుంకుమతో పాటు ఛత్తీస్‌గఢ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఫొటో, సంబంధిత కేసులోని నిందితుడు, బాధితుడి ఫొటోలు అక్కడ లభించినట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పరారైన మిగతా ముగ్గురి కోసం గాలింపు చేపట్టినట్లు సమాచారం. బెయిల్ కోసం న్యాయపరమైన మార్గాన్ని ఆశ్రయించాల్సిన చోట తాంత్రిక పూజలకు పాల్పడటం ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
also read: సూరత్‌లో దారుణం.. 14 ఏళ్ల చిన్నారిపై సవతి తండ్రి లైంగిక దాడి, గర్భం దాల్చిన బాలిక
