Homeక్రైమ్ఇద్దరు భార్యల మధ్య గొడవ: ఒకరి మృతి, భయంతో మరొకరి ఆత్మహత్య

ఇద్దరు భార్యల మధ్య గొడవ: ఒకరి మృతి, భయంతో మరొకరి ఆత్మహత్య

కుటుంబ కలహం తీవ్ర విషాదానికి దారితీసిన ఘటన కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. వాంకిడి మండలం సోనాపూర్‌లో ఇద్దరు మహిళల మధ్య జరిగిన గొడవలో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. పోలీసుల విచారణ భయంతో మరో మహిళ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

సోనాపూర్‌కు చెందిన ఆత్రం కన్నుకు రాంబాయి, సాకృబాయి అనే ఇద్దరు భార్యలు ఉన్నారు. వీరి మధ్య కొంతకాలంగా కుటుంబ విషయాలపై విభేదాలు ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో జరిగిన గొడవలో రాంబాయి కర్రతో సాకృబాయిపై దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సాకృబాయిని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సాకృబాయి పరిస్థితి విషమించడంతో శుక్రవారం మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరోవైపు, సాకృబాయి మృతికి సంబంధించి తనపై పోలీసుల విచారణ జరుగుతుందనే భయంతో రాంబాయి తీవ్ర ఆందోళనకు గురైనట్లు సమాచారం. శనివారం మధ్యాహ్నం పొలంలో పురుగుమందు సేవించిన ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయగా.. మార్గమధ్యంలోనే ఆమె మృతి చెందింది.

ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళలు వరుసగా ప్రాణాలు కోల్పోవడంతో సోనాపూర్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనకు సంబంధించి పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

also read: చేవెళ్ల రెస్టారెంట్‌లో దాడి.. మద్యం తెచ్చివ్వలేదని మేనేజర్‌పై ఐదుగురి దౌర్జన్యం

తాజావార్తలు