పాకిస్థాన్ మాజీ అంతర్గత వ్యవహారాల మంత్రి, అవామీ ముస్లిం లీగ్ అధినేత షేక్ రషీద్ అహ్మద్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్ఈటీ)కు చెందిన వ్యక్తులతో కలిసి ఆయన ఓ బహిరంగ కార్యక్రమంలో వేదిక పంచుకున్నట్లు కనిపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
ఆ కార్యక్రమంలో షేక్ రషీద్.. 2008 ముంబై ఉగ్రదాడుల ప్రధాన సూత్రధారిగా భారత్ ఆరోపించిన, ఎల్ఈటీ వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్‌ను ప్రస్తావిస్తూ ప్రశంసలు కురిపించినట్లు వీడియోలో వినిపిస్తోంది. తాను హఫీజ్ సయీద్‌కు విధేయుడినని చెప్పడంతో పాటు, పాకిస్థాన్‌తో, హఫీజ్ సయీద్‌తో తాను ఉన్నానని ఆయన వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.
వేదికపై ఎల్ఈటీకి చెందిన సీనియర్ వ్యక్తులుగా పేర్కొంటున్న ఖలీద్ మసూద్ సంధు, ఖారీ మహమ్మద్ యాకూబ్ షేక్‌లతో కలిసి రషీద్ కనిపించారు. ఈ సందర్భంగా భారత్‌పై కూడా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు వీడియోలో ఉంది. పాకిస్థాన్‌ను భారత్ లక్ష్యంగా చేసుకుంటే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరిక ధోరణిలో మాట్లాడారు. భారత్‌లో పక్షులు కూయవు, ఆలయాల్లో గంటలు మోగవంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
అమెరికాలో ఉన్న సమయంలో తన ఫోన్లో హఫీజ్ సయీద్‌కు సంబంధించిన నంబర్ కనిపించడంతోనే తనను అక్కడి నుంచి బహిష్కరించారని కూడా షేక్ రషీద్ చెప్పినట్లు వీడియోలో పేర్కొనబడింది.
షేక్ రషీద్ గతంలో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంలో 2020 నుంచి 2022 వరకు పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. దేశ అంతర్గత భద్రతకు కీలక బాధ్యతలు నిర్వహించిన మాజీ మంత్రి.. నిషేధిత ఉగ్రవాద సంస్థకు చెందిన వ్యక్తులతో కలిసి కనిపించడం, భారత్‌పై ఘాటు వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది.
అయితే, వైరల్ అవుతున్న ఈ వీడియోకు సంబంధించిన కార్యక్రమం ఎప్పుడు, ఎక్కడ జరిగిందనే అంశంపై పూర్తి వివరాలు స్వతంత్రంగా ధృవీకరించాల్సి ఉంది. వీడియోలోని వ్యాఖ్యల ఆధారంగానే షేక్ రషీద్‌పై ప్రస్తుతం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
also read: బిల్ గేట్స్ కుమార్తెకు ఊహించని షాక్… ఫియా షాపింగ్ స్టార్టప్‌పై ‘కుకీ స్టఫింగ్’ ఆరోపణలు..
