క్రైమ్ మిర్రర్ : ఇటలీలోని పాఠశాలల్లో బుర్కా, నికాబ్ ధరించడంపై నిషేధం విధిస్తూ ప్రధాని జార్జియా మెలోనీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. పాఠశాలల్లో భద్రత, విద్యార్థుల మధ్య సమానత్వం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. బుర్కా లేదా నికాబ్ ధరించాలని మహిళలు, బాలికలను బలవంతం చేయడం వారి ప్రాథమిక హక్కులను హరించడమేనని ప్రధాని మెలోనీ వ్యాఖ్యానించారు. భద్రతా కారణాలతోనే పాఠశాలల్లో ముఖాన్ని పూర్తిగా కప్పే దుస్తులపై నిషేధం తీసుకొచ్చినట్లు ఆమె స్పష్టం చేశారు. ఈ ఏడాది జులైలో నేషనల్ ఫ్యూచర్ పార్టీ పాఠశాలల్లో బుర్కాపై నిషేధం విధించాలని డిమాండ్ చేసిన నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఇటాలియన్ భాషపై కూడా పరిమితులు
పాఠశాలల్లో బుర్కా, నికాబ్‌పై నిషేధంతో పాటు ఇటాలియన్ భాషపై కూడా మెలోనీ ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఒక తరగతిలో ఇటాలియన్ భాషపై తగిన పరిజ్ఞానం లేని విద్యార్థుల సంఖ్య 30 శాతానికి మించకూడదని నిర్ణయించింది. విద్యార్థులు ఇటాలియన్ భాష నేర్చుకునేందుకు వారి తల్లిదండ్రులకు ఉచిత భాషా తరగతులు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయినప్పటికీ తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇటాలియన్ నేర్పించడంలో విఫలమైతే వెయ్యి యూరోల వరకు జరిమానా విధించే నిబంధనను కూడా ప్రకటించింది.
ఇటాలియన్ భాషపై పట్టు లేకపోవడం వల్ల విద్యార్థులు చదువులో వెనుకబడే అవకాశం ఉందని విద్యాశాఖ మంత్రి జుసేప్పే వాల్దితారా తెలిపారు. విద్యార్థుల విద్యాభివృద్ధిలో తల్లిదండ్రుల పాత్ర కీలకమని ఆయన పేర్కొన్నారు. ఇటలీలో దాదాపు 34 వేల పాఠశాలలు ఉన్నాయని, వాటిలో సుమారు 30 శాతం విద్యార్థులు విదేశీ నేపథ్యానికి చెందినవారని మంత్రి వెల్లడించారు. కొత్త నిబంధనల ద్వారా విద్యార్థుల భాషా నైపుణ్యాలను మెరుగుపరచడంతో పాటు పాఠశాలల్లో విద్యా వాతావరణాన్ని మరింత సమర్థంగా నిర్వహించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
also read : సంపూర్ణేశ్ బాబు క్లారిటీ.. నాగేంద్ర కుమార్‌తో వివాదంపై హీరో స్పందన
