-
యూకే వీసా స్కామ్ ఆరోపణలు..
-
స్పందించిన నందు వరల్డ్ జంట..
-
ఫేక్ ప్రచారమంటూ ఫైర్!
క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: సోషల్ మీడియాలో లక్షలాది మంది ఫాలోవర్లను సంపాదించుకున్న నందు వరల్డ్ జంట మరోసారి వార్తల్లో నిలిచింది. యూకే వీసాల పేరుతో భారీ మోసానికి పాల్పడ్డారంటూ వస్తున్న ఆరోపణలపై తాజాగా నంద కిశోర్ భార్య మధుమిత స్పందించారు. తమపై జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని, ఇది పూర్తిగా దుష్ప్రచారమని ఆమె పేర్కొన్నారు.
ఇటీవల సోషల్ మీడియాలో కొందరు బాధితులమంటూ వీడియోలు, పోస్టులు షేర్ చేస్తుండగా ఈ వ్యవహారం పెద్ద చర్చకు దారితీసింది. అయితే ఈ ఆరోపణలపై స్పందించిన మధుమిత.. కొందరు కావాలనే డబ్బులు ఖర్చు చేసి తమపై నెగిటివ్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారని ఆరోపించారు. యూకేలో ఇప్పటికే ఈ అంశంపై చర్యలు తీసుకున్నారని, అక్కడి నుంచి వెళ్లిపోయిన కొందరు తెలుగు వ్యక్తులు తమపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ప్రజలు ఇలాంటి ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు.
అలాగే తమకు లేదా తమ భర్తకు ఇండియాలో ఎలాంటి కంపెనీలు లేవని మధుమిత స్పష్టం చేశారు. కొందరు వ్యక్తులు తమ పేర్లు, కంపెనీ పేర్లు, వర్క్‌ప్లేస్‌లను దుర్వినియోగం చేస్తూ ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిపారు. తమకు సంబంధించిన అధికారిక సమాచారం ఏదైనా ఉంటే తామే నేరుగా వెల్లడిస్తామని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, నందు వరల్డ్ జంట యూకేలో ఉద్యోగాలు, వీసాలు ఇప్పిస్తామని చెప్పి నిరుద్యోగుల నుంచి భారీ మొత్తాలు వసూలు చేశారనే ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్షిప్ (COS) ఇప్పిస్తామని నమ్మబలికి ఒక్కో వ్యక్తి నుంచి లక్షల రూపాయలు తీసుకున్నారంటూ కొందరు ఆరోపిస్తున్నారు. డబ్బులు చెల్లించిన తర్వాత తమ కాల్స్‌కు స్పందించడం లేదని కూడా బాధితులుగా చెప్పుకుంటున్న కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
కాగా, ఇదే తరహా ఆరోపణలు గతంలో కూడా నందు వరల్డ్ జంటపై వచ్చాయి. అప్పట్లో కూడా వారు వాటిని ఖండించారు. ఇప్పుడు మరోసారి ఈ వివాదం తెరపైకి రావడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే మధుమిత మాత్రం ఆరోపణలను పూర్తిగా తోసిపుచ్చుతూ, ఇది తమపై జరుగుతున్న దుష్ప్రచారమేనని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.