క్రైం మిర్రర్ : ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలో సంచలన ఘటన చోటుచేసుకుంది. తనపై చాలా కాలంగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని మామపై ఓ మహిళ దాడి చేసి ప్రైవేట్ పార్ట్ ని కట్ చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. బుధానా ప్రాంతంలోని సఫీపూర్ పట్టిలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధిత మహిళ భర్త ఉపాధి నిమిత్తం హర్యానాలో ఆటో రిక్షా నడుపుతూ ఎక్కువ సమయం అక్కడే ఉంటున్నాడు. దీంతో మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి ముజఫర్‌నగర్‌లో నివసిస్తోంది. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని మామ జాకిర్ తనపై గత రెండేళ్లుగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడని మహిళ ఆరోపించింది. తనకు ఎదురవుతున్న ఇబ్బందుల గురించి పలుమార్లు చుట్టుపక్కల వారికి తెలియజేసినప్పటికీ సరైన స్పందన రాలేదని ఆమె పోలీసులకు తెలిపినట్లు సమాచారం. పరిస్థితులు తీవ్రతరం కావడంతో ఆగ్రహానికి గురైన మహిళ మామపై దాడి చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
ఘటనలో తీవ్రంగా గాయపడిన జాకిర్‌ను పోలీసులు వెంటనే సమీపంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడికి చికిత్స కొనసాగుతోంది. ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. మహిళను అదుపులోకి తీసుకుని వివరాలు సేకరిస్తున్నట్లు బుధానా సర్కిల్ ఆఫీసర్ గజేంద్ర పాల్ సింగ్ తెలిపారు. ఆరోపణలపై ఆధారాలు సేకరించి తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.
also read : ఆంధ్రప్రదేశ్ లో ‘కరోనా కలకలం…! రెండు వారాల్లో నలుగురు మృతి…