జూనియర్ ఎన్టీఆర్ పేరుతో ప్రారంభమైన ‘RAW NTR’ సంస్థపై కొనసాగుతున్న వివాదానికి తెరదించే ప్రయత్నం జరిగింది. ఈ సంస్థతో తనకు గానీ, తన వ్యక్తిగత కార్యాలయానికి గానీ ఎలాంటి సంబంధం లేదని ఎన్టీఆర్ టీమ్ ఇప్పటికే స్పష్టం చేసింది.
తాజాగా ఈ వ్యవహారంపై RAW NTR వ్యవస్థాపకుడు సాయి రూప్ స్పందించారు. అభిమానులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించాలనే ఉద్దేశంతోనే ఈ సంస్థను ప్రారంభించామని ఆయన తెలిపారు.
జూనియర్ ఎన్టీఆర్ పేరు లేదా ప్రతిష్టకు ఎలాంటి నష్టం కలిగించే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు. అలాగే RAW NTRకు రాజకీయాలతో సంబంధం లేదని, ఇది పూర్తిగా సేవా కార్యక్రమాల కోసమే ఏర్పాటు చేసిన వేదిక అని వెల్లడించారు.
అభిమానుల సహకారంతో పేదలకు సహాయం చేయడం, సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టడమే తమ లక్ష్యమని సాయి రూప్ పేర్కొన్నారు. కాగా, ఎన్టీఆర్ టీమ్ చేసిన ప్రకటన తర్వాత RAW NTRపై సోషల్ మీడియాలో చర్చ మరింత పెరిగిన విషయం తెలిసిందే.
గతంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ పేరుతో కొన్ని కార్యక్రమాలు, సంస్థలపై వచ్చిన ప్రచారాల విషయంలో ఆయన టీమ్ స్పష్టత ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అభిమానులు కూడా అధికారిక సమాచారం ఆధారంగానే స్పందించాలని సూచిస్తున్నారు.
also read: గోదావరిలో విషాదం.. చేపల వేటకు వెళ్లిన ఇద్దరు మహిళలు మృతి, ముగ్గురు గల్లంతు