క్రైం మిర్రర్ : ఖమ్మం జిల్లాలో దారుణ హత్య కలకలం రేపింది. అర్ధరాత్రి వేళ ఓ ఇంట్లోకి చొరబడిన గుర్తుతెలియని దుండగులు బంగారు ఆభరణాలను దోచుకునే ప్రయత్నంలో వృద్ధ మహిళను అత్యంత కిరాతకంగా హత్య చేసి పరారయ్యారు. ఈ ఘటనతో గ్రామంలో భయాందోళనలు నెలకొనగా, పోలీసులు నిందితుల కోసం ముమ్మరంగా గాలింపు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామానికి చెందిన చెన్నా జనార్ధన్, సుగుణమ్మ (60) దంపతులు తమ నివాసంలో ఉండగా అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించారు. సుగుణమ్మ మెడలో ఉన్న బంగారు నగలను లాక్కునేందుకు ప్రయత్నించారు. దీంతో ఆమె ప్రతిఘటించడంతో పదునైన ఆయుధంతో దాడి చేసి గొంతు కోసి హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
హత్య అనంతరం నిందితులు ఆమె ధరించిన బంగారు ఆభరణాలను తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు. ఉదయం విషయం బయటపడటంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే తిరుమలాయపాలెం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ నిపుణుల సహాయం తో ఆధారాలు సేకరించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టారు. దోపిడీ కోసమే హత్య జరిగిందా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణాల్లోనూ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటన పిండిప్రోలు గ్రామంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. పూర్తి వివరాలు అధికారిక దర్యాప్తులో వెలుగులోకి రానున్నాయి.
also read : తెలంగాణలో రేషన్ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు.. ఏటీఎం తరహా స్మార్ట్ కార్డులు త్వరలో!