క్రైమ్ మిర్రర్ : ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. అద్దె ఇంట్లో జరిగిన ఈ విషాద ఘటన స్థానికులను షాక్‌కు గురిచేసింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించగా, ఫోరెన్సిక్ నిపుణులు, క్లూస్ టీమ్ ఘటనాస్థలంలో కీలక ఆధారాలను సేకరించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాయ్‌పూర్‌లోని తికారాపారా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సంజయ్ నగర్ ప్రాంతంలో సాజిద్ అలీ తన భార్య, ముగ్గురు చిన్నారులతో కలిసి అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. కొంతకాలంగా కుటుంబం ఆర్థిక సమస్యలు, వ్యక్తిగత ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్నట్లు ప్రాథమిక సమాచారం వెల్లడిస్తోంది.
ఇంట్లోకి వెళ్లిన పోలీసులు సాజిద్ అలీ మృతదేహాన్ని గదిలోని సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతున్న స్థితిలో గుర్తించారు. అదే గదిలో ఆయన భార్యతో పాటు ముగ్గురు చిన్నారులు విగతజీవులుగా పడి ఉండటం మరింత విషాదాన్ని మిగిల్చింది. ఇంట్లోని పరిస్థితులను పరిశీలించిన అధికారులు పలు కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.
ప్రాథమిక దర్యాప్తులో భాగంగా, కుటుంబ పెద్ద మొదట భార్య, పిల్లలకు విషపదార్థం ఇచ్చి, అనంతరం తాను ఉరివేసుకుని ఉండొచ్చనే అనుమానాన్ని పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. అయితే పోస్టుమార్టం నివేదిక, ఫోరెన్సిక్ పరీక్షల ఫలితాలు వచ్చిన తర్వాతే మరణాలకు గల ఖచ్చితమైన కారణం వెల్లడవుతుందని అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
also read : హైవేపై విమానం.. ట్రాలీపై వెళ్తున్న దృశ్యం వైరల్