క్రైం మిర్రర్ : సంగారెడ్డి జిల్లాలోని జోగిపేటలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల మధ్య అమాయక పసికందు ప్రాణాలు కోల్పోయిన ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. భార్యతో జరిగిన వాగ్వాదం అనంతరం ఆగ్రహానికి గురైన తండ్రి.. కేవలం 18 రోజుల వయస్సున్న శిశువును నేలకేసి కొట్టడంతో చిన్నారి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
పోలీసుల వివరాల ప్రకారం.. జోగిపేట పట్టణానికి చెందిన కృష్ణ, గౌరమ్మ ప్రేమించి వివాహం చేసుకున్నారు. ఇటీవల వారికి కుమారుడు జన్మించాడు. బాలింత అయిన గౌరమ్మ ఆరోగ్యం బాగోలేక ఇంటి పనులు, వంట చేయలేకపోతున్నట్లు తెలిపింది. ఈ విషయమై శుక్రవారం రాత్రి భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగింది.
శనివారం ఉదయం కూడా ఇదే విషయంపై మరోసారి ఇద్దరి మధ్య గొడవ చెలరేగింది. ఆగ్రహంతో ఉన్న కృష్ణ, గౌరమ్మ ఒడిలో ఉన్న 18 రోజుల పసికందును బలవంతంగా లాక్కుని నేలపై పలుమార్లు కొట్టినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. తీవ్రంగా గాయపడిన చిన్నారిని కుటుంబ సభ్యులు తొలుత జోగిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా, పరిస్థితి విషమంగా ఉండటంతో సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శిశువు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఘటనపై సమాచారం అందుకున్న జోగిపేట పోలీసులు ఆస్పత్రికి చేరుకుని వివరాలు సేకరించారు. చిన్నారి తల్లి గౌరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు కృష్ణను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
also read : అహ్మదాబాద్‌లో బాణసంచా కర్మాగారంలో ఘోర పేలుడు.. 8 మంది మృతి