ఢిల్లీ మద్యం విధానం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆప్ నేత కేజ్రీవాల్ తో పాటు పలువురు కీలక నాయకులపై ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారనే ఆరోపణలతో స్వయంగా కోర్టు ధిక్కరణ చర్యలు ప్రారంభించారు. అదే సమయంలో ఈ కేసు విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు కూడా ప్రకటించారు.
నిజానికి ఈ కేసులో కేజ్రీవాల్‌తో పాటు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, వినయ్ మిశ్రా, సౌరభ్ భరద్వాజ్ పేర్లు ప్రస్తావనకు వచ్చాయి. 2021-22 ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో కేజ్రీవాల్, కల్వకుంట్ల కవిత సహా 23 మందిని ట్రయల్ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. అయితే ఆ తీర్పును సవాలు చేస్తూ సీబీఐ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.
మరో బెంచ్ కు ధిక్కరణ కేసు బదిలీ
కేసు జస్టిస్ స్వర్ణకాంత శర్మ బెంచ్ ముందు విచారణకు రావడంతో, ఈ వ్యవహారాన్ని మరో ధర్మాసనానికి బదిలీ చేయాలని కేజ్రీవాల్ వర్గం కోరింది. ఈ నేపథ్యంలో స్పందించిన న్యాయమూర్తి, తనపై కోర్టు ధిక్కరణ చర్యలు ప్రారంభించిన పరిస్థితిలో అదే కేసును తాను విచారించడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. ‘‘నేను ఈ కేసు విచారణ కొనసాగిస్తే, వ్యక్తిగత కక్షతో తీర్పు ఇచ్చానని భావించే అవకాశం ఉంది. అందుకే న్యాయవ్యవస్థపై నమ్మకం నిలబెట్టేందుకు కేసును మరో బెంచ్‌కు బదిలీ చేస్తున్నా’’ అని జస్టిస్ స్వర్ణకాంత శర్మ పేర్కొన్నారు.
అసత్య ప్రచారాలపై ఆగ్రహం
ఇక తనపై సోషల్ మీడియాలో జరిగిన ప్రచారంపై కూడా ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక లా కాలేజీలో ఇచ్చిన ప్రసంగానికి సంబంధించిన వీడియోను ఎడిట్ చేసి, ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రమంలో మాట్లాడినట్లు తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. ఇది న్యాయమూర్తిని కించపరచే ప్రయత్నమని వ్యాఖ్యానించారు. రాజకీయ నాయకులు, ఇతర శక్తులు న్యాయమూర్తులపై ఒత్తిడి తీసుకురావడం సరికాదని, ఇలాంటి ధోరణిని ప్రోత్సహిస్తే న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ముప్పు ఏర్పడుతుందని హెచ్చరించారు. అలాగే, వినయ్ మిశ్రా చేసిన సోషల్ మీడియా పోస్టును ప్రస్తావిస్తూ, అతనిపై కూడా కోర్టు ధిక్కరణ చర్యలు ప్రారంభిస్తున్నట్లు స్పష్టం చేశారు.