క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణలో విద్యా విప్లవానికి ఆరుట్ల నుంచి శ్రీకారం చుట్టింది తెలంగాణ ప్రభుత్వం. కార్పొరేట్ విద్యాసంస్థలకు ధీటుగా అత్యాధునిక వసతులతో ఇబ్రహీంపట్నంలోని ఆరుట్లలో నిర్మించిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ పైలాన్ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం అక్కడే విద్యార్థులతో పాటు బ్రేక్‌ఫాస్ట్ చేసిన సీఎం వారితో కాసేపు ముచ్చటించారు. తర్వాత స్కూల్లో ఉన్న డిజిటల్ క్లాస్‌రూమ్స్, లైబ్రరీ, సైన్స్ ల్యాబ్స్, డైనింగ్ హాల్, క్రీడా మైదానాలను పరిశీలించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్కూల్ కమిటీ సభ్యులతో ప్రత్యేకంగా సమావేశమై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ప్రభుత్వ పాఠశాల అంటే కేవలం ఉచిత విద్య మాత్రమే కాదు.. నాణ్యత, సౌకర్యాలు, భవిష్యత్ అవకాశాల్లోనూ ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలకు ఏమాత్రం తీసిపోకూడదనే ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం కొత్త విద్యా నమూనాను ఆవిష్కరించింది. ఇది కేవలం ఒక పాఠశాల ప్రారంభం కాదు.. రాష్ట్ర ప్రభుత్వ విద్యా వ్యవస్థలో కొత్త అధ్యాయానికి నాంది. పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు ప్రపంచస్థాయి విద్యను పూర్తిగా ఉచితంగా అందించే లక్ష్యంతో ఈ మోడల్‌ను రూపొందించారు.
పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రభుత్వం నాలుగు పాఠశాలలను ఎంపిక చేసింది. మొదటి విడతలో రంగారెడ్డి జిల్లాలోని ఆరుట్ల, మంచాల పాఠశాలలతో పాటు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని వంగూరు, పోల్కంపల్లి పాఠశాలలను ఎంపిక చేశారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్ కాన్సెప్ట్‌ను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు ప్రజా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. రాష్ట్రంలో దశలవారీగా 100 తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌ను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్‌లో మొత్తం 1,814 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రీ-ప్రైమరీ విభాగంలో 150 మంది, ప్రైమరీ స్కూల్‌లో 600 మంది, హైస్కూల్ రెండు బ్లాకుల్లో కలిపి 800 మంది, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 160 మంది, రెండో సంవత్సరంలో 104 మంది విద్యార్థులు ఉన్నారు. చిన్నారుల తొలి అడుగు నుంచి ఇంటర్మీడియట్ పూర్తి చేసే వరకు ఒకే ప్రాంగణంలో ఇంగ్లీష్ మీడియం విద్య అందించే విధంగా వ్యవస్థను రూపొందించారు. విద్యార్థుల అభ్యాస ప్రయాణం మధ్యలో అంతరాయం లేకుండా చూసే ప్రయత్నం ఇది. పుస్తకాలతో పాటు పోషకాహారం విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం పోషకాహార స్నాక్స్‌ను ప్రభుత్వం ఉచితంగా అందించనుంది. చదువుతో పాటు ఆరోగ్యాన్ని కూడా సమానంగా పరిగణించే విధానం ఇది. పరిసర గ్రామాల విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. ఐదు బస్సులు రోజువారీ రవాణా సేవలు అందించనున్నాయి.