క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో : రాష్ట్రంలో సర్ పేరుతో వైసీపీ సానుభూతిపరులు, కార్యకర్తల ఓట్లు తొలగించే ప్రమాదం ఉన్న నేపథ్యంలో నాయకులు అప్రమత్తంగా ఉండాలని పార్టీ నాయకులను ఆ పార్టీ అధినేత జగన్ హచ్చరించారు. రాష్ట్రంలో సర్ జరుగుతున్న తీరు, అక్రమాలపై చర్చించేందుకు పార్టీకి చెందిన ముఖ్య నాయకులతో జగన్ మంగళవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన జగన్మోహన్‌రెడ్డి.. సర్‌పై అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రానున్న నాలుగు వారాలు అత్యంత కీలకమన్న ఆయన.. నియోజకవర్గ కో-ఆర్డినేటర్లు ప్రతిరోజూ సమీక్ష చేయాలని సూచించారు. ఏదో విధంగా వైసీపీ ఓట్లు తొలగించేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఎక్కడైనా తప్పులు జరుగుతున్నాయని తెలిస్తే వెంటనే అప్రమత్తం కావాలని, సంబంధిత అఽధికారులకు ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. అధికార దుర్వినియోగంతో ఓట్లు తీసేందుకు ప్రయత్నం చేస్తున్నారన్న జగన్.. ప్రతి బూత్‌కు 50 వైసీపీ ఓట్లు తీసేయాలని చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. నియోజకవర్గ కో-ఆర్డినేటర్లు దీన్ని అడ్డుకోవాలని ఆదేశించారు. ప్రతి ఓటును కాపాడుకోవాలని, సర్‌పై నియోజకవర్గాల్లోని కో-ఆర్డినేటర్లు, రీజనల్ ఇన్‌చార్జ్‌లు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
కేంద్ర కార్యాలయానికి తెలియజేయాలని ఆదేశం..
సర్ జరుగుతున్న నేపథ్యంలో ఎదురయ్యే ఇబ్బందులను స్థానిక నాయకులు పరిష్కరించే ప్రయత్నం చేయాలన్న జగన్.. అప్పటికీ పరిష్కారం కాకపోతే వెంటనే కేంద్ర కార్యాలయానికి విషయాన్ని తెలియజేయాలని నాయకులకు సూచించారు. సర్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం వద్దని హెచ్చరించారు. సర్ ప్రక్రియలో ఒకసారి ఓటు తొలగిస్తే.. దాన్ని తిరిగి చేర్చాలంటే అత్యంత కష్టమన్నారు. ప్రతి నియోజకవర్గ సమన్వయకర్త దీన్నిదృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. గిమ్మిక్కులతో ఓట్లను తొలగించే తప్పుడు పనుల్లో ఆరితేరిన వ్యక్తి చంద్రబాబు అని పేర్కొన్న జగన్.. సర్ ప్రక్రియపై నిరంతరం సమీక్షలు నిర్వహించాలని నాయకులకు సూచించారు.
ఆక్వా రైతులకు మద్ధతుగా..
ఆక్వా రైతులతోనూ జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రైతులను ఉద్ధేశించి ఆయన మాట్లాడుతూ ఆక్వా ఫీడ్ ధరలను ఈ నెలాఖరులోగా తగ్గించాలని, లేదంటే జూలై ఒకటి, రెండు తేదీల్లో ఆక్వా రైతుల తరఫున పోరాటాన్ని చేస్తానని హెచ్చరించారు. తాను కూడా ఆక్వా రైతులకు మద్ధతుగా వెళ్లానని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని రైతులు, ఆక్వా రైతులు దారుణమైన స్థితిలో ఉన్నారన్న జగన్.. తమ హయాంలో ఈ రైతులు ఆనందంగా ఉండాలనే ఉద్ధేశంతో కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు వెల్లడించారు. రైతులు చేయి పట్టుకుని నడిపించే వ్యవస్థలో భాగంగా ఆర్బీకేలను అందుబాటులో తెచ్చామని, రాష్ట్ర వ్యాప్తంగా పది వేలకుపైగా ఆర్బీకేలను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. ఆక్వా రైతులకు తోడుగా 35 ఆక్వా ఇంటిగ్రేటెడ్ ల్యాబ్‌లు, 782 ఆర్బీకేల్లో ఫిషరీస్ అసిస్టెంట్లను నియమించినట్టు వెల్లడించారు. చంద్రబాబు ప్రభుత్వం ఆక్వా రైతులకు ఇబ్బందులను పరిష్కరించాలని, లేదంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.