రాయలసీమ గడ్డపై రాయల్ ఎన్‌ఫీల్డ్ అడుగుపెడుతున్న వేళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి.. ఈ బుల్లెట్ బండికి మధ్య ఉన్న దశాబ్దాల అనుబంధం ఆసక్తికరంగా మారింది. చంద్రబాబు రాజకీయ ప్రస్థానం ఒక బుల్లెట్ ర్యాలీతోనే ప్రారంభం కావడం విశేషం. ఇప్పుడు అదే రాయల్ ఎన్‌ఫీల్డ్ తయారీ యూనిట్ తిరుపతి సమీపంలోని ఏర్పేడు వద్ద కొలువుదీరనుంది. ఈ మేరకు ప్రభుత్వ యంత్రాంగం స్థల సేకరణ ప్రక్రియను వేగవంతం చేసింది. చంద్రబాబు దార్శనికతతో ప్రపంచ స్థాయి వాహన తయారీ సంస్థ చిత్తూరు జిల్లాకు రావడం పారిశ్రామిక రంగంలో సరికొత్త సంచలనంగా మారింది.
చంద్రబాబు రాజకీయ జీవితానికి బుల్లెట్ బైక్‌కు దశాబ్దాల కిందటి నుంచే ఒక ప్రత్యేక అనుబంధం ఉంది. గతంలో దివంగత ప్రధాని ఇందిరా గాంధీ తిరుపతికి వచ్చినప్పుడు ఆమెకు వినూత్న రీతిలో స్వాగతం పలికారు చంద్రబాబు. అప్పట్లో విద్యార్థి నాయకుడిగా ఉన్న బాబు వందలాది బుల్లెట్లతో భారీ ర్యాలీ నిర్వహించి ఇందిరా గాంధీ దృష్టిని ఆకర్షించారు. ఆ సాహసోపేతమైన ర్యాలీ ఆయనకు రాజకీయ గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇందిరా గాంధీ నేరుగా ఆయనను గుర్తించి విద్యార్థి నాయకుడి కోటాలో చంద్రగిరి అసెంబ్లీ టికెట్ ఇచ్చారు. 1978లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి ఎమ్మెల్యేగా అడుగుపెట్టిన ఆయన అతి పిన్న వయసులోనే మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
దశాబ్దాల కాలం గడిచినా చంద్రబాబుకు బుల్లెట్ బండిపై ఉన్న మక్కువ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ ఎక్కడైనా బుల్లెట్ కనిపిస్తే దాన్ని డ్రైవ్ చేయడానికి ఆయన ఎంతో ఉత్సాహం చూపిస్తారు. రాజకీయాల్లో ఎంతో ఎత్తుకు ఎదిగినా తన తొలి నాటి జ్ఞాపకాలను ఆయన నిరంతరం గుర్తు చేసుకుంటూ ఉంటారు. తన రాజకీయ అరంగేట్రానికి వేదికైన ఆ బుల్లెట్ బ్రాండ్‌నే ఇప్పుడు తన సొంత జిల్లాకు తీసుకురావడంలో ఆయన విజయం సాధించారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ భారీ పెట్టుబడితో ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేయబోతోంది. దీనివల్ల స్థానిక యువతకు వేలాది సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.
ఏర్పేడు ప్రాంతంలో ఈ పరిశ్రమ స్థాపన కోసం ప్రభుత్వం అవసరమైన భూములను కేటాయించే పనుల్లో నిమగ్నమైంది. చెన్నై – బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌లో భాగంగా ఈ యూనిట్ కీలకం కానుంది. రాయలసీమను ఆటోమొబైల్ హబ్‌గా మార్చాలన్న చంద్రబాబు ఆకాంక్షకు ఇది ఒక నిదర్శనం. గతంలో కియా మోటార్స్‌ను అనంతపురానికి తీసుకువచ్చిన ఆయన ఇప్పుడు రాయల్ ఎన్‌ఫీల్డ్‌ను తిరుపతి చెంతకు చేరుస్తున్నారు. బుల్లెట్ ర్యాలీతో మొదలైన ఆయన ప్రయాణం.. అదే బుల్లెట్ పరిశ్రమను రాష్ట్రానికి తీసుకురావడంతో ఒక పూర్తి స్థాయి వృత్తాన్ని పూర్తి చేసినట్లయింది. ఈ పరిశ్రమ రాకతో చిత్తూరు జిల్లా పారిశ్రామిక ముఖచిత్రం పూర్తిగా మారిపోనుంది.