హైదరాబాద్, క్రైమ్‌మిర్రర్: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ అయిన ఈపీఎఫ్ఓ తమ సేవలను మరింత సులభంగా మార్చేందుకు కొత్త మార్పులు తీసుకొస్తోంది. ఈపీఎఫ్ ఓ 3.0 పేరుతో కొత్త డిజిటల్ వ్యవస్థను అమలు చేస్తోంది. దీని ద్వారా ఉద్యోగులు తమ పీఎఫ్ డబ్బును త్వరలో ఏటీఎం మరియు యుపీఐ ద్వారా కూడా తీసుకునే అవకాశం ఉండబోతోంది. ఈ కొత్త సౌకర్యం మే నెల చివరి నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం.
ఇప్పటి వరకు పీఎఫ్ డబ్బు తీసుకోవాలంటే ఆన్‌లైన్ క్లెయిమ్ పెట్టాలి లేదా కొన్ని ప్రక్రియలు పూర్తి చేయాలి. కానీ కొత్త వ్యవస్థలో ఏటీఎం కార్డ్ ఉపయోగించి డబ్బు తీసుకోవచ్చు. అలాగే యుపీఐ ద్వారా కూడా పీఎఫ్ డబ్బును నేరుగా బ్యాంక్ ఖాతాకు ట్రాన్స్‌ఫర్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీంతో ఉద్యోగులకు చాలా సౌకర్యంగా మారనుంది.
ఈపీఎఫ్ఓ సభ్యులకు ప్రత్యేక ఏటీఎం కార్డులు ఇవ్వాలని అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ఈ కార్డులు వారి పీఎఫ్ ఖాతాలకు లింక్ అవుతాయి. ఏటీఎంలో కార్డ్ ఉపయోగించి అవసరమైన మొత్తాన్ని సులభంగా తీసుకోవచ్చు. అయితే మొత్తం పీఎఫ్ డబ్బును తీసుకునే అవకాశం ఉండకపోవచ్చు. సమాచారం ప్రకారం, ఖాతాలో ఉన్న మొత్తంలో 50 శాతం వరకు మాత్రమే తీసుకునే పరిమితి ఉండొచ్చు.
ఈ సౌకర్యాన్ని ఉపయోగించాలంటే కొన్ని అర్హతలు తప్పనిసరిగా ఉండాలి. ఉద్యోగి యొక్క యుఎఎన్ నంబర్ యాక్టివ్‌గా ఉండాలి. అలాగే ఆధార్, పాన్, బ్యాంక్ అకౌంట్, ఐఎఫ్ ఎస్‌సీ కోడ్ వంటి కేవైసీ వివరాలు పూర్తిగా లింక్ అయి ఉండాలి. ఇవి సరైన విధంగా అప్డేట్ చేసి ఉంటేనే ఏటీఎం మరియు యుపీఐ సౌకర్యం పనిచేస్తుంది.
ఏపీఎప్ ఓ 3.0 ద్వారా మరిన్ని మార్పులు కూడా రానున్నాయి. క్లెయిమ్ సెటిల్‌మెంట్ వేగంగా పూర్తయ్యేలా కొత్త టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం చాలామంది సభ్యుల అడ్వాన్స్ క్లెయిమ్స్ మూడు రోజుల్లోనే పూర్తవుతున్నాయి. దీంతో ఉద్యోగులకు డబ్బు త్వరగా అందుతోంది.
ఇటీవల ఈపీఎఫ్ఓ రికార్డు స్థాయిలో కోట్లాది క్లెయిమ్స్ పరిష్కరించింది. చెక్ లీఫ్ అప్లోడ్ చేయకుండా కూడా చాలా మంది సభ్యులు క్లెయిమ్స్ పూర్తి చేశారు. అలాగే ఉద్యోగదాత ఆమోదం లేకుండానే బ్యాంక్ అకౌంట్ లింక్ చేసే సౌకర్యం కూడా అందుబాటులోకి వచ్చింది.