Homeతెలంగాణటార్గెట్ బండి సంజయ్...!

టార్గెట్ బండి సంజయ్…!

  • బిఆర్ఎస్ రాజకీయ వ్యూహం

  • తమను అధికారంలోకి రాకుండా అడ్డుకున్నారన్న పగ

  • భవిష్యత్తులో బిజెపిని నిలువరించే ప్రయత్నం

  • పక్కా వ్యూహంతో గులాబీ పార్టీ

క్రైమ్ మిర్రర్, హైదరాబాద్: బండి సంజయ్ కుమారుడి వివాదం వెనుక ఉన్నది ఎవరు? గులాబీ పార్టీనా? లేకుంటే కాంగ్రెస్ ప్రభుత్వమా? ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. అయితే ఈ వివాదం తెరపైకి వచ్చిన నాటి నుంచి కాంగ్రెస్ పార్టీ కంటే గులాబీ పార్టీ ఎక్కువగా హడావిడి చేస్తోంది. ఈ ఘటనను సాకుగా చేసుకుని బండి సంజయ్ ను రాజకీయంగా ఉక్కిరి బిక్కిరి చేయాలని చూస్తోంది.

రాష్ట్రవ్యాప్తంగా గులాబీ పార్టీ శ్రేణులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టడం చూస్తుంటే ఆ పార్టీకి బండి సంజయ్ పై ఉన్న ఆగ్రహం ఇట్టే అర్థమయిపోతుంది. కేంద్ర మంత్రివర్గం నుంచి బండి సంజయ్ ను తొలగించాలని డిమాండ్తో కారు పార్టీ నేతలు గట్టిగానే ఆందోళనలు చేపడుతున్నారు. మరోవైపు బండి సంజయ్ కుమారుడిని రేవంత్ సర్కార్ కాపాడుతోంది అంటూ ఆరోపణలు చేస్తుంది బిఆర్ఎస్. దీని వెనుక గులాబీ పార్టీకి బలమైన వ్యూహం ఉన్నట్లు అర్థమవుతోంది.

లోతైన కారణం..
బండి సంజయ్ ను బిఆర్ఎస్ టార్గెట్ చేయడం వెనుక లోతైన రాజకీయ కారణాలు ఉన్నాయి. గత సాధారణ ఎన్నికలకు ముందు కెసిఆర్ సర్కార్ను ప్రజల్లో పలుచన చేసింది బండి సంజయ్. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండే సమయంలో గులాబీ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడేవారు సంజయ్. అప్పటి ప్రభుత్వ పనితీరును ఇరుకున పెట్టేవారు.

ఒకానొక దశలో తెలంగాణలో బిజెపిని బండి సంజయ్ అధికారంలోకి తీసుకు వస్తారు అనేటంత ఊపు తెచ్చారు. అయితే బండి సంజయ్ ను బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించిన తర్వాత.. కమలం పార్టీ హవా తెలంగాణలో తగ్గింది. దాని ప్రభావం కాంగ్రెస్ ఎదుగుదలకు దోహదపడింది. కేవలం బండి సంజయ్ తీరుతోనే తాము అధికారంలోకి రాలేకపోయామన్న ఆవేదన గులాబీ పార్టీ పెద్దలు అల్లుకుపోయింది.

అందుకే ఆది నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం కంటే బండి సంజయ్ ను టార్గెట్ చేసుకుంది గులాబీ పార్టీ. తాము అధికారం నుంచి దూరం కావడానికి.. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి సంజయ్ ఒక కారణమని అనుమానిస్తోంది. ఈ లెక్క తోనే బండి సంజయ్ కుమారుడిని రేవంత్ సర్కార్ కాపాడుతుందని ఆరోపిస్తోంది.

కరీంనగర్ లో బీజం..
ఇటీవల జరిగిన పరిణామాల క్రమం చూస్తే తప్పకుండా దీని వెనుక కుట్ర కోణం ఉంది. అసలు ఈ ఘర్షణ వాతావరణానికి బీజం కరీంనగర్ లో పడింది. గులాబీ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని టార్గెట్ చేస్తూ బండి సంజయ్ వర్గీయులు గొడవకు దిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడిని నిరసిస్తూ గులాబీ పార్టీ కరీంనగర్ బంద్ కు పిలుపునిచ్చింది.

దీంతో కరీంనగర్ మొత్తం రణరంగంగా మారింది. ఇటువంటి పరిస్థితుల్లో అనుమానాస్పదంగా బండి సంజయ్ కుమారుడిపై ఫోక్సో కేసు నమోదు కావడం గులాబీ పార్టీకి రాజకీయ అస్త్రంగా మారింది. ఒక ఆయుధంగా దానిని మార్చుకున్న గులాబీ పార్టీ బండి సంజయ్ కు కౌంటర్ ఇచ్చే క్రమంలో తెలంగాణ రాజకీయాన్ని పతాక స్థాయికి తీసుకెళ్తోంది.

బలమైన నేత కావడంతో..
వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని భారతీయ జనతా పార్టీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. కేంద్ర పెద్దలు సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఈ ఎన్నికలను. ఇటువంటి సమయంలో రాష్ట్ర బిజెపిలో బలమైన నేతగా ఉన్నారు బండి సంజయ్. ఇప్పుడు ఆయన కుమారుడు కేసును అడ్డం పెట్టుకుని బండి సంజయ్ ను రాజకీయంగా దెబ్బతీస్తే.. వచ్చే ఎన్నికల నాటికి తమకు ఒక పెద్ద అడ్డంకి తొలగుతుందన్నది గులాబీ పార్టీ అంతర్గత వ్యూహం.

ఒకవైపు ఈ కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. ఒకవైపు దర్యాప్తు కొనసాగుతుండగా.. ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా పొలిటికల్ మైలేజీ పొందాలన్నది గులాబీ పార్టీ ఆలోచనగా స్పష్టం అవుతుంది. తమను ముప్పు తిప్పలు పెట్టిన బండి సంజయ్ విషయంలో అస్సలు వెనక్కి తగ్గేదేలే అంటూ గులాబీ పార్టీ గట్టిగానే ఉంది. మరి ఈ విషయంలో ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు