-
బండి సంజయ్ కుమారుడు వివాదంతో ముఖం చాటేస్తున్న నాయకులు
-
పార్టీ కార్యాలయంలో సైతం అందుబాటులోకి రాని వైనం
-
ఫోన్లు సైతం స్విచ్ ఆఫ్
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో బండి సంజయ్ కుమారుడు వ్యవహారము ఇప్పుడు హాట్ టాపిక్. భారతీయ జనతా పార్టీలో ఈ వివాదం తీవ్ర అల్లకల్లోలాని సృష్టిస్తోంది. ఈ కేసు పరిణామాల క్రమంలో తెలంగాణలోని బిజెపి కీలక నేతలంతా అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయారనే చర్చ నడుస్తోంది. ఈ సున్నిత అంశంపై ఎక్కడ స్పందించాల్సి వస్తుందో అన్న భయంతో నాయకులు అందుబాటులో ఉండడం లేదని వార్తలు వస్తున్నాయి.
చివరకు పార్టీ కార్యకర్తలు ఫోన్ చేసినా నేతలు స్పందించడం లేదు. క్యాడర్ కు స్పష్టమైన దిశ నిర్దేశం లేక గందరగోళం నెలకొంది. పలువురు సీనియర్ నేతలు తమ ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసుకుని మీడియాకు దూరంగా ఉంటున్నారు. చివరికి పార్టీ కార్యాలయంలో ముఖ్య నేతలు కనిపించడం లేదు. అత్యవసర సమావేశాలకు సైతం నేతలు హాజరు కాకపోవడం ఇప్పుడు అనుమానాలకు తావిస్తోంది.
ప్రధాని మోదీ పర్యటన తరువాత…
వాస్తవానికి ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణలో పర్యటించారు. మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన తొలిసారిగా తెలంగాణ పర్యటనకు వచ్చారు. రేపు చేరుతారు అనగా.. బండి సంజయ్ కుమారుడి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దాదాపు పదివేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం ద్వారా.. తెలంగాణలో అభివృద్ధి అజెండాతో ముందుకు వెళ్లాలని బిజెపి పక్కా ప్రణాళిక వేసుకుంది.
కానీ బండి సంజయ్ కుమారుడి వివాదంతో అది బెడిసి కొట్టింది. ప్రధాని పర్యటన తరువాత వీర లెవెల్లో బిజెపి కార్యక్రమాలను విస్తరించాలని భావించింది పార్టీ హై కమాండ్. కానీ ఇలా చుక్కెదురు కావడంతో బిజెపి నేతలు తీవ్ర నిరాశకు గురయ్యారు.
అనేక రకాల అనుమానాలు..
అయితే బండి సంజయ్ కుమారుడి వివాదంలో సొంత పార్టీ నేతల పాత్ర ఉందన్న అనుమానాలు కూడా ఉన్నాయి. గతంలో చాలామంది నేతలతో తనకు విభేదాలు ఉన్నట్లు బండి సంజయ్ సంకేతాలు ఇచ్చారు. సొంత పార్టీలోనే ఓ ఎంపీ అయితే బండి సంజయ్ పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. గులాబీ పార్టీ నుంచి వచ్చిన సదరు ఎంపీ తిరిగి మాతృ పార్టీలో చేరుతారని జరిగిన ప్రచారం వెనుక బండి సంజయ్ ఉన్నారన్న అనుమానాలు వ్యక్తం చేశారు.
తన సొంత నియోజకవర్గంలో బండి సంజయ్ వర్గం ఆధిపత్యాన్ని ఆ ఎంపీ సహించుకోలేకపోయారు. అదే వివాదం కొనసాగుతూ వచ్చింది. అయితే ఇప్పుడు బండి సంజయ్ కుమారుడి వివాదంలో ఎలా ముందుకు వెళ్లాలో బిజెపి నేతలకు తెలియడం లేదు. క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులు సైతం ఏం జరుగుతుందో తెలియక సతమతం అవుతున్నాయి.
ఒక్కరంటే ఒక్క ముఖ్య నేత కూడా ఇప్పుడు అందుబాటులో లేకపోవడం చూస్తుంటే.. బిజెపి అలాంటి సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటుందో అర్థం అవుతుంది. అదే సమయంలో పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన బండి సంజయ్ విషయంలో సైతం.. పార్టీ నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు దక్కకపోవడం సైతం హాట్ టాపిక్ అవుతుంది. అంతిమంగా ఈ కేసు ఎంతవరకు వెళ్తుందో చూడాలి.