-
వచ్చేయడానికి జగన్ పాదయాత్ర ప్రారంభం
-
రెండు సంవత్సరాల పాటు ప్రజల్లోనే…
-
పార్టీ పగ్గాలతో పాటు తాడేపల్లి కేంద్ర కార్యాలయం బాధ్యతలు సైతం…
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: వైయస్ భారతి రెడ్డికి పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించనున్నారా? రెండు సంవత్సరాల పాటు ఆ బాధ్యతల్లో ఆమె ఉండనున్నారా? ఈ మేరకు జగన్మోహన్ రెడ్డి సూత్రప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చారా? అంటే అవును అనే సమాధానం వినిపిస్తోంది. త్వరలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు సిద్ధపడుతున్నారు. రాష్ట్రంలో రెండేళ్ల పాటు సుదీర్ఘంగా పాదయాత్ర చేసేందుకు సన్నాహాల్లో ఉన్నారు. అందుకు సంబంధించిన షెడ్యూల్ కూడా సిద్ధం చేశారు. అయితే ఈ రెండేళ్ల పాటు పార్టీ రాష్ట్ర బాధ్యతలు, తాడేపల్లి కేంద్ర కార్యాలయం నిర్వహణ బాధ్యతలు వైయస్ భారతీ రెడ్డికి అప్పగిస్తారని తెలుస్తోంది. అవసరం అనుకుంటే ఆమెకు పార్టీ రాష్ట్ర పగ్గాలు ఇచ్చేందుకు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.
అత్యంత క్లిష్ట సమయం…
ఇప్పటివరకు తెర వెనుక వైయస్ భారతి రెడ్డి సేవలందిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా సేవలందించాల్సిన అవసరం ఏర్పడింది. పార్టీ కష్టకాలంలో ఉంది. సీనియర్ నేతలు ఒక్కొక్కరు పార్టీకి దూరమయ్యారు. ఇటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి ఇతరులకు పార్టీని అప్పగించేందుకు ఇష్టపడడం లేదు. సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారు కానీ ఆయనపై ఒక రకమైన విమర్శలు ఉన్నాయి.. అందుకే సొంత వారిని రంగంలోకి దించి పార్టీ బాధ్యతలు అప్పగించాలని జగన్ భావిస్తున్నారు. అందుకు సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ వర్క్ పూర్తయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సాక్షి మీడియా బాధ్యతను చూస్తున్నారు భారతీ రెడ్డి. ఇప్పుడు పార్టీ బాధ్యతలను కూడా చూడనున్నారు. పార్టీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి ఉంటారు. వర్కింగ్ ప్రెసిడెంట్గా భారతీ రెడ్డి బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది.
పార్టీని నడిపేందుకు…
వచ్చే ఏడాది పాదయాత్రకు సిద్ధపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. దాదాపు రెండు సంవత్సరాలపాటు ప్రజల మధ్య ఉండేలా ప్రణాళిక రూపొందించారు. అయితే ఆ సమయంలో పార్టీని సమన్వయం చేసుకునేవారు ఇప్పుడు అవసరం. సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్న ఆశించిన స్థాయిలో పనిచేయలేకపోతున్నారు. మరోవైపు తల్లి విజయమ్మతో పాటు చెల్లెలు షర్మిల ఇప్పటికే దూరమయ్యారు. షర్మిల రాజకీయంగా కూడా విభేదిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో భారతీ రెడ్డిని రంగంలోకి దించి.. పార్టీ బాధ్యతలు అప్పగించేందుకు జగన్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. చూడాలి మరి అందులో ఎంతవరకు వాస్తవం ఉందో.
