Homeతెలంగాణమర్రిగూడ ఎస్సీ కాలనీలో ఆక్రమణల రాజ్యం...!

మర్రిగూడ ఎస్సీ కాలనీలో ఆక్రమణల రాజ్యం…!

  • ప్రభుత్వ స్థలాలు కబ్జా.. రోడ్లపై ర్యాంపులు

  • మురుగునీటితో ప్రజల అవస్థలు..పలుమార్లు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం

మర్రిగూడ (క్రైమ్ మిర్రర్): మర్రిగూడ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో ప్రభుత్వ స్థలాల ఆక్రమణలు, రోడ్లపై అక్రమ నిర్మాణాలు, డ్రైనేజీ సమస్యలు కాలనీవాసులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ప్రజలకు ఉపయోగపడాల్సిన ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలకు గురవుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నా, సంబంధిత అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలు నిత్యం రాకపోకలు సాగించే బీటీ, సీసీ రోడ్లపై కొందరు ఇళ్ల యజమానులు ర్యాంపులు నిర్మించడంతో, రహదారులు కుంచించుకుపోయి రాకపోకలకు ఆటంకం ఏర్పడుతోంది. మర్రిగూడ ఎస్సి కాలనీలో చేదురువాయి భూమి వద్ద ఉన్న, ప్రభుత్వ ఖాళీ స్థలాన్ని పక్కింటి వారు ఆక్రమించినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై లేదా? ఆక్రమణలపై ఫిర్యాదులు అందినా క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకోలేరా? అన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

మరోవైపు బీటీ, సీసీ రోడ్లపై నిర్మించిన ర్యాంపులు ప్రజలకు ఇబ్బందికరంగా మారుతున్నాయి. రోడ్లు ప్రజల రాకపోకల కోసం ఉన్నాయా? లేక వ్యక్తిగత నిర్మాణాలకు వేదికలుగా మారాయా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక రోడ్లపై అక్రమ నిర్మాణాల కారణంగా మురుగునీటి పారుదలకు ఆటంకం ఏర్పడి, కాలనీలో పారిశుద్ధ్య సమస్య తీవ్రమవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కనిపించడం లేదని చెబుతున్నారు. ఈ సమస్యలపై గతంలో పలుమార్లు గ్రామపంచాయతీ అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ స్పందన లేకపోవడం అధికారుల పనితీరుపై అనుమానాలకు తావిస్తోంది. ప్రజల సమస్యలు పరిష్కరించాల్సిన గ్రామపంచాయతీ అధికారులు ఫిర్యాదులకే పరిమితమవుతున్నారా? ప్రభుత్వ స్థలాల పరిరక్షణ, రహదారులపై అక్రమ నిర్మాణాల తొలగింపు, డ్రైనేజీ నిర్వహణ ఎవరి బాధ్యత? ప్రజలు ఎన్ని మార్లు కార్యాలయాల చుట్టూ తిరగాలి?

సమస్యలు పరిష్కరించాల్సిన అధికారులు మౌనం వహిస్తే సామాన్య ప్రజలు ఎవరిని ఆశ్రయించాలి? అన్న ప్రశ్నలు కాలనీవాసుల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి ఎస్సీ కాలనీలో క్షేత్రస్థాయి విచారణ చేపట్టాలని, ప్రభుత్వ స్థలాల హద్దులను నిర్ధారించి ఆక్రమణలు ఉన్నట్లు తేలితే తొలగించాలని, రోడ్లపై ఉన్న అక్రమ ర్యాంపులు, నిర్మాణాలను పరిశీలించి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. మురుగునీటి పారుదలకు శాశ్వత పరిష్కారం చూపేలా డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఫిర్యాదులు చేసినా పట్టించుకోని అధికారుల తీరుపై, విచారణ జరిపి బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని మర్రిగూడ ఎస్సీ కాలనీ ప్రజలు జిల్లా కలెక్టర్ ను కోరుతున్నారు.

ఇవి కూడ చ‌ద‌వండి:
  1. యలహంక ప్యాలెస్ వివాదం.. నేడే కీలక విచారణ!
  2.  బిస్లరీ వాటర్ శాంపిల్స్ నాణ్యత పరీక్షల్లో విఫలం, చట్టపరమైన చర్యలకు సిద్ధమైన FSSAI!
  3.  భాగ్యనగరానికి ఉగ్ర హెచ్చరిక.. బాంబులు పెడతామంటూ పోలీసులకు బెదిరింపు మెయిల్!
  4. ఉదయం అల్పాహారం ఆలస్యమైతే ఆయుష్షుకు ముప్పు.. జాగ్రత్త!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు