క్రైమ్ మిర్రర్,హైదరాబాద్:- తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరానికి ఉగ్రవాద ముప్పు పొంచి ఉందన్న వార్త తీవ్ర కలకలం రేపుతోంది. నగరంలో భారీ ఎత్తున బాంబు పేలుళ్లకు పాల్పడతామంటూ పోలీసులకు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు ఈ-మెయిల్ రావడం సంచలనంగా మారింది. ఈ ఘటనతో తెలంగాణ పోలీసు యంత్రాంగం మరియు నిఘా వర్గాలు పూర్తిస్థాయిలో అప్రమత్తమయ్యాయి.
వివరాల్లోకి వెళితే, లష్కరే తోయిబా ఉగ్రవాది లతీఫ్ భట్ ఎన్కౌంటర్కు ప్రతీకారంగా హైదరాబాద్లో దాడులు చేస్తామని ఆ బెదిరింపు మెయిల్లో పేర్కొన్నారు. నగరంలోని అత్యంత రద్దీగా ఉండే కాచిగూడ రైల్వే స్టేషన్ మరియు ప్రముఖ హోటల్ టూరిస్ట్ ప్లాజాలో బాంబులు పేలుస్తామని దుండగులు హెచ్చరించారు. అంతేకాకుండా, గతంలో ముంబైని వణికించిన 26/11 తరహా ఉగ్రదాడులను హైదరాబాద్లో రిపీట్ చేస్తామని, ఈ దాడుల్లో కనీసం 300 మందిని పొట్టనబెట్టుకోవడమే తమ ప్రధాన టార్గెట్ అని ఆ మెయిల్లో తీవ్రంగా హెచ్చరించడం భయాందోళనలకు గురిచేస్తోంది.
ఈ బెదిరింపు మెయిల్ అందిన వెంటనే పోలీసు ఉన్నతాధికారులు అత్యవసరంగా స్పందించారు. నగరవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. ముఖ్యంగా కాచిగూడ రైల్వే స్టేషన్, హోటల్ టూరిస్ట్ ప్లాజా పరిసర ప్రాంతాల్లో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలతో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. నగరంలోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, షాపింగ్ మాల్స్, ఇతర జనసమ్మర్థం ఎక్కువగా ఉండే రద్దీ ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
మరోవైపు, ఈ బెదిరింపు మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇది నిజంగానే ఉగ్రవాద సంస్థల పనా లేక ఎవరైనా ఆకతాయిలు చేసిన ఫేక్ మెయిలా? అనే కోణంలో సైబర్ క్రైమ్ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని, అనుమానాస్పద వస్తువులు లేదా వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
