చిత్తూరు నగరపాలక సంస్థలో రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏకైక కార్పొరేటర్‌గా ఎన్నికైన సి. హరిణి తన పదవికి రాజీనామా చేశారు. కూటమి నేతలతో కలిసి ఏకగ్రీవానికి సహకరించారంటూ సొంత పార్టీ నాయకుల నుంచి ఆరోపణలు రావడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
శనివారం తన రాజీనామా పత్రాన్ని నగరపాలక సంస్థ కమిషనర్ నరసింహప్రసాద్‌కు అందజేశారు. తనపై వస్తున్న ఆరోపణలను హరిణి తీవ్రంగా ఖండించారు. ఈ వ్యవహారంపై తన వివరణను తెలియజేస్తూ ఓ వీడియోను కూడా విడుదల చేశారు.
చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో మొత్తం 60 డివిజన్లు ఉండగా, 51 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరిలో వైసీపీ తరఫున ఎన్నికైన ఏకైక కార్పొరేటర్ హరిణి కావడంతో ఈ వ్యవహారం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. సొంత పార్టీ నేతల ఆరోపణల నేపథ్యంలో ఆమె రాజీనామా చేయడం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
also read: రూ.1,000 కోట్ల సైబర్ స్కామ్.. ఏపీలో మరో ఇద్దరు అరెస్ట్!
